Maha Kumbh mela: మహాకుంభ మేళాలో మరోసారి అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు
Maha Kumbh mela: మహాకుంభ మేళాలో మరోసారి అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు
Fire accident at Maha Kumbh mela: మహాకుంభ మేళాలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 18, సెక్టార్ 19 మధ్య ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్స్ కు నిప్పంటుకుని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి భక్తులు భయంతో దూరంగా పరుగెత్తారు. వెంటనే అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు, యూపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అదృష్టవశాత్తుగా ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగలేదు. అయితే, మహా కుంభమేళాలో స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులు, సాధువులు ఆయా టెంట్స్ లో దాచుకున్న లగేజీ, ఇతర వస్తుసామాగ్రి మంటల్లో కాలిబూడిదయ్యాయి.
గత వారం కూడా ఇదే సెక్టార్ 18లో టెంట్స్ కు మంటలు అంటుకున్నాయి. దాదాపు 20 టెంట్స్ కాలి బూడిదయ్యాయి.
అంతకంటే ముందు జనవరి 19న సెక్టార్ 19లో గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు అంటుకున్నాయి. అప్పుడు కూడా భారీ సంఖ్యలో టెంట్స్, గుడిసెలు కాలిపోయాయి. మహా కుంభమేళా మొదలయ్యాక ఇప్పటివరకు ఇలా మూడుసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. లక్షల సంఖ్యలో జనం తరలి వస్తున్న చోట ఇలా తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.