ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతుల ఆందోళనలు

* ఇవాళ్టితో 67వ రోజుకు చేరిన నిరసనలు * ఈనెల 6న హైవేలు దిగ్బంధం చేయాలని రైతు సంఘాల పిలుపు

Update: 2021-02-02 01:54 GMT

Farmers protest

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న రైతు సంఘాల ఆందోళనలు ఇవాళ్టితో 67వరోజుకు చేరాయి. ఎన్ని అడ్డంకులువచ్చినా వెనక్కి తగ్గేది లేదంటూ రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దులకు రైతుల రాక పెరిగింది. ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు వస్తున్నారు. దీంతో బోర్డర్‌లను బ్లాక్ చేస్తున్నారు పోలీసులు. ఇక నిరసనల్లో భాగంగా ఈనెల 6న దేశవ్యాప్తంగా హైవేలు బ్లాక్‌ చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కొత్త సాగు చట్టాలు రద్దు చేసే వరకు తమ పోరు ఆపేది లేదని చెబుతున్నారు.

ఇక రైతులు ఆందోళనలు చేస్తోన్న బోర్డర్‌కు సమీపంలో ఉన్న నాలుగు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఢిల్లీ నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది. ట్రాఫిక్‌ తగ్గితే మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్టు మెట్రో అథారిటీ తెలిపింది. మరోవైపు ఢిల్లీ సరిహద్దులకు భారీగా రైతులు చేరుకుంటుండటంతో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని ఢిల్లీ పోలీసులు కోరారు. దీంతో సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నారు.

 మరోవైపు ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు 120 మందిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు.. 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ర్యాలీ సందర్భంగా చనిపోయిన రైతుపై తప్పుడు ప్రచారం చేశారని జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలపైనా కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News