డీఎంకేలో మరో విషాదం.. కీలకనేత కన్నుమూత

Update: 2020-03-07 04:45 GMT

ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేల మృతితో షాక్ లో ఉన్న డీఎంకేలో మరో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌(97) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వయసురీత్యా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సమాచారం అందుకున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అన్బళగన్‌ మరణాన్ని దృవీకరించారు. అన్బళగన్‌ దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి, అన్నాదురైకి స్నేహితులు.. 1944-1957 వరకు పచయప్ప కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

శనివారం తెల్లవారుజామున 1 గంటలకు మరణించినట్లు పార్టీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ తెలిపారు. అన్బళగన్‌ దివంగత పార్టీ అధ్యక్షుడు ఎం. కరుణానిధికి సన్నిహితుడని, పార్టీ ప్రధాన కార్యదర్శిగా 43 సంవత్సరాలు పనిచేశారని ఎంకె స్టాలిన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 1977 లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అన్బాగగన్ నియమితులయ్యారు. ఫిబ్రవరి 24 న వయస్సు సంబంధిత వ్యాధుల కారణంగా అతన్ని అపోలో ఆసుపత్రులలో చేర్పించారు.. అయితే ఆ తరువాత అతని పరిస్థితి విషమంగా మారింది. అన్బళగన్‌ తొమ్మిది సార్లు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.. గతంలో డిఎంకె ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

ఆర్థిక మంత్రిగా కంటే ముందు సాంఘిక సంక్షేమ, విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మొత్తం తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికై రాష్ట్రానికి సేవలందించారు. ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. 1984 లో, శ్రీలంకలో తమిళులకు మద్దతుగా అన్బళగన్‌ తమిళనాడు అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అన్బళగన్‌ మరణం కారణంగా డీఎంకే అధినేత స్టాలిన్ ఇవాళ అన్ని పార్టీ కార్యకలాపాలను రద్దు చేశారు. అన్బళగన్‌ పార్ధివదేహంపై డీఎంకే జెండా కప్పి నివాళులు అర్పించారు స్టాలిన్. ప్రస్తుతం అన్బళగన్‌ భౌతికకాయాన్ని చెన్నైలోని కిల్‌పాకంలో ఉన్న ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. 

Tags:    

Similar News