చెన్నై నగరానికి వరద ముప్పు.. 3 రోజులు ఎవరూ చెన్నై రావొద్దన్న సీఎం స్టాలిన్

*రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ *భారీ వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలం *చెరువులను తలపిస్తున్న రోడ్లు

Update: 2021-11-07 11:42 GMT

భారీ వర్షాలతో చెన్నై నగరానికి వరద ముప్పు

Tamil Nadu Floods: గత కొన్నేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు ముంచెత్తడంతో చెన్నై నగరం షడ్‌డౌన్ అయిపోయింది. నిన్న రాత్రి నుంచి గ్యాప్ లేకుండా వర్షాలు దంచికొట్టడంతో నగరమా నడి సంద్రమా అన్నంతగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా పెరంబూర్ బ్యారక్స్ రోడ్డు, ఒట్టేరి వంతెన, పాడి తదితర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇదే సమయంలో రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ రిపోర్ట్స్ చెన్నై వాసులను టెన్షన్ పెడుతున్నాయి.

మరోవైపు.. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో చెన్నై మహానగరంలోని రోడ్డు, సబ్‌వేలు అన్నీ నీట మునిగాయి. దీంతో నగరంలోని అన్ని సబ్‌వేలను మూసివేసిన అధికారులు.. ట్రాఫిక్ మళ్లీంపు చర్యల్లో బిజీ అయ్యారు. మరోసారి భారీ వర్షాలు తప్పవన్న హెచ్చరికలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. చెన్నైతో పాటు తిరువల్లూర్​లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

గరిష్టంగా ఈరోడ్‌ జిల్లా గోపిశెట్టిపాళయంలో 11 సెంటీమీటర్లు, విరుదునగర్‌, సేలం, నామక్కల్‌, శ్రీవిల్లిపుత్తూర్‌, రాశిపురం, మదురై, శివకాశి, కడలూరు జిల్లాల్లో తలా 8 సెంటీమీటర్లు, కొడైకెనాల్‌, కోవిల్‌పట్టి, ఖయత్తారు ప్రాంతాల్లో తలా 6 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో 11,12 తేదీల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఈ జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే, ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన నీలగిరి, కొడైకెనాల్‌లలో కురుస్తున్న భారీవర్షాలకు ఘాట్‌ రోడ్డులో మట్టిపెళ్లలు, బండరాళ్లు జారిపడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నీలగిరి జిల్లాలోని కున్నూరు, కుందా రోడ్డు, కరుంపాలం, పీక్కాడు ఎస్టేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షపు నీటిలో క్యారెట్‌, క్యాబేజీ తదితర పంటలు మునిగిపోయాయి. అదేవిధంగా దిండుగల్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కొడైకెనాల్‌ ప్రాంతంలో రహదారుల్లో వర్షపు నీరు వరదలా ప్రవహించింది. ఘాట్‌ రోడ్డులో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, మట్టిపెళ్లలు జారిపడడంతో ఆ మార్గంలో వాహనాల్లో వెళ్లిన సందర్శకులు కదల్లేని పరిస్థితి నెలకొంది.

ఇక, చెన్నై నగరం పూర్తిగా వర్షపు నీటిలో ఉండటంత సీఎం స్టాలిన్ నేరుగా రంగంలోకి దిగారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం సహాయక చర్యల్లో అధికారులకు అండగా నిలవాలని ఆదేశించారు. ఇప్పటికే వర్షాల పరిస్థితి పైన నిరంతం సమీక్షలు చేస్తున్న సీఎం స్టాలిన్ కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసారు. కూలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్‌, టెలిఫోన్‌ స్తంభాలను గుర్తించి తక్షణం తొలగించాలని, ప్రాణనష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం అన్ని శాఖలతో కలసి అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెయిన్ కోట్ తో సీఎం స్వయంగా వర్షపు నీటిలోనే తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించటంతో పాటుగా.. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.

మరోవైపు.. భారీ వర్షాలు దంచికొట్టడంతో చెన్నై శివారుల్లోని డ్యామ్‌లు మరింత టెన్షన్ పెడుతున్నాయి. నగర శివారులోని పుళల్, చెంబరంపాక్కం డ్యామ్‌లకు వరద ముప్పు పొంచి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. డ్యామ్‌ల దగ్గర పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు చెంబరంపాక్కం చెరువు గేట్లను తెరవాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇక ఇదే సమయంలో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Tags:    

Similar News