Delhi Violence : 531 కేసులు నమోదు.. 1,600 మందికి పైగా అరెస్ట్..

Update: 2020-03-05 02:17 GMT

ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 531 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి 1,647 మందిని అరెస్టు చేశారని ఒక అధికారి తెలిపారు. ఇందులో నలభై ఏడు కేసులను ఆయుధ చట్టం కింద నమోదు చేసినట్లు ఆ అధికారి స్పష్టం చేశారు. పోలీసుల కథనం ప్రకారం, పోలీసు కంట్రోల్ రూమ్ (పిసిఆర్) కు గత ఏడు రోజులలో అల్లర్లకు సంబంధించి ఎటువంటి కాల్స్ రాలేదని.. అల్లర్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు. అలాగే మంగళవారం , మౌజ్‌పూర్‌లో జరిగిన హింసాకాండలో నిరాయుధ పోలీసు సిబ్బందిని తుపాకీతో దాడి చేయబోయిన మొహమ్మద్ షారుఖ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సోమవారం అల్లర్లు జరిగిన ప్రాంతంలో మరో నాలుగు మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 45కు చేరింది. ఆరోజు నుంచి ఎవ్వరూ మరణించలేదు. అలాగే గాయాలతో దాదాపు 300 మందికి పైగా ఇప్పటికి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపింప జేస్తున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈశాన్య ఢిల్లీలో క్రమంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది. వారం రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు నిత్యావసర వస్తువులు , ఇతర అవసరాల కోసం బయటకు వస్తున్నారు.

వాహనాల రాకపోకలు పెరిగాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో భారీగా పోలీసు , భద్రతా సిబ్బందిని మోహరించారు.. హింసాకాండపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్చార్సీ) రెండు నిజ నిర్ధారణ కమిటీలను నియమించిన సంగతి తేలిసిందే.. ఇప్పటికే ఎన్‌హెచ్చార్సీ సభ్యులు పలు ప్రాంతాల్లో పర్యటించి వివరాలను సేకరించారు.. ఈశాన్య ప్రాంత స్కూళ్లలో ఇప్పటికే వార్షిక పరీక్షలను వాయిదా వేసిన సంగతి తేలిసిందే. అలాగే వాయిదాపడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను సోమవారం నుంచి పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. పరీక్షలకు దాదాపు 98 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అధికారులు తెలిపారు.  

Tags:    

Similar News