Corona virus Spread: నీటి ద్వారా కరోనా వ్యాపించదు

Corona virus Spread: నీటి ద్వారా కరోనా వ్యాపించదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్‌ తెలిపారు.

Update: 2021-05-08 03:07 GMT

Coronavirus:(File Image)

Corona virus Spread: కరోనా కమ్మేస్తోంది. మన జీవితాలను శాసిస్తోంది. ప్రాణాలు బలవంతంగా తీసుకుపోతోంది. అస్సలు ఆ పేరు వింటేనే గుండె ఆగిపోయినంత పని అయిపోతోంది. ఇప్పటి వరకు ఒక మనిషి శ్వాసకోశాల ద్వారా వేరే వ్యక్తికి వస్తుంది అని ఇప్పటి మనందరికీ తెలిసిందే. అస్సలు ఈ కరోనా ఇంకా అనేక రకాలుగా వ్యాపిస్తుందా అనే దానిపై విపరీతమైన అనుమానాలు అందరి మనసులను తొలిసే ప్రశ్న. రోజుకో రకమైన వార్త వింటూ అందరూ ఆందోళనకు గురౌతున్నారు. కరోనా నీటి ద్వారా కూడా వ్యాపిస్తుంది అంటూ చాలాకాలంగా ప్రచారంలో ఉంది. అయితే, నీటి ద్వారా కరోనా వ్యాప్తి జరగదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కరోనా వైరస్ నీళ్ళలో పడితే నిర్వీర్యం అయిపోతుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్‌ స్పష్టం చేశారు. నీటిలో పడితే కరోనా వైరస్ శక్తి పూర్తిగా పోతుందనీ, అక్కడ నుంచి వ్యాపిస్తుందనే భయం అవసరం లేదనీ ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన భరోసా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను యమునా నదిలో పారవేస్తున్నారు. ఈ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. 'మనుషులు ఎదురెదురుగా ఉన్నప్పుడు వెలువడే తుంపర్ల ద్వారానే ప్రధానంగా వైరస్‌ విస్తరిస్తుంది. గాలిలో వ్యాప్తిచెందే అంశం గాలివీచే దిశపై ఆధారపడి ఉంటుంది. గాలివాటు ఎటు ఉంటే అటువైపు కొంత దూరం వరకు వైరస్‌ విస్తరిస్తుంది. తలుపులు మూసిన నాలుగు గోడల మధ్య వైరస్‌ ఎక్కువ కేంద్రీకృతమవుతుంది. తలుపులు తెరిస్తే పడిపోతుంది. నీటి ద్వారా విస్తరిస్తుందన్న ఆందోళన అవసరం లేదు'' అని తెలిపారు.

ఇక రాఘవన్ ఇటీవల దేశంలో మూడోవేవ్ వచ్చే అవకాశం ఉందంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దేశంలో కట్టుదిట్టమైన కట్టడి చర్యలు చేపడితే మూడో ఉద్ధృతి రాకపోవచ్చని పేర్కొన్నారు. స్థానికంగా, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో చేపట్టే కట్టడి చర్యలు ఎంత ధృడంగా ఉన్నాయి అనేదానిపై ఈ ఉధృతి ఆధారపడి ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, సర్వైలెన్స్‌ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేస్తే వ్యాధి లక్షణాలు లేని వారి నుంచి వైరస్‌ విస్తరించడాన్ని అరికట్టొచ్చని వివరించారు. మాస్క్‌ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించే వారికి రక్షణ ఉంటుందన్నారు. ఇంతవరకు జాగ్రత్తలు తీసుకొని, ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే వైరస్‌ వ్యాపిస్తుందని హెచ్చరించారు.

Tags:    

Similar News