కరోనా దెబ్బకు కుదేలైన విగ్రహాల తయారీ కళాకారుల జీవితాలు

Update: 2020-08-24 06:29 GMT

Coronavirus Outbreak Hits Idol Makers Business: ప్రశాంతంగా సాగిపోతున్న వృత్తులను కరోనా తీవ్రంగా దెబ్బకొట్టింది. తమ కష్టం మీద తాము బతుకుతున్న వారిని కరోనా కష్టాల్లోకి నెట్టింది. చేతికి పనిలేక ఏంచేయాలో తెలియని అయోమయంలో పడేసింది. ఆఖరికి కళాకారులపై కూడా కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు నిలయం మన భారతదేశం. తమ ఆరాధ్య దేవుళ్ళకు, పితృ దేవతలకు, మొక్కులు సమర్పిస్తుంటారు. బోనాలు, జాతరలు నిర్వహిస్తుంటారు. ఆయా సమయాలలో తమ ఇష్ట దైవాల బొమ్మలు, విగ్రహాలు ప్రతిష్టిస్తుంటారు. వాటికి పూజలు, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఈ పండగల సమయంలో, విగ్రహాలకు మంచి డిమాండ్ ఉంటుంది.

ఈ బొమ్మలు, విగ్రహాల తయారీపై వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తుంటాయి. అదే వృత్తిగా తమ జీవనాన్ని సాగిస్తుంటారు. సంవత్సరంలో ఆరు నెలలకు పైగా ఈ బొమ్మలు, విగ్రహాల తయారీ ఉంటుంది. ఆ రంగంపై ఆధారపడిన కుటుంబాలకు చేతినిండా పని ఉండేది. కానీ కరోనా పుణ్యామా అని పండగలు, ఉత్సవాలలో విగ్రహాల తయారీలో నిమగ్నమైన కళాకారులకు పని లేకుండాపోయింది. మన దేశంలో జరిగే పండగలు ఒక ఎత్తైతే, దసరా, వినాయక చవితికి ప్రత్యేక స్థానం ఉంది. కోట్లాది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో దసరా, వినాయక చవితి పండగలు నిర్వహిస్తుంటారు. దేశంలోని ప్రతి వీధి, ప్రతి వాడలో వినాయక, దుర్గాదేవి విగ్రహాలతో కళకళలాడుతుంటాయి. ప్రజలు అత్యంత ఆనందోత్సవాలతో ఈ పండగలను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్‌ విగ్రహ తయారీ కళాకారులను కోలుకోలేని దెబ్బకొట్టింది. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు పెరగుతుండటంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. పూజా కార్యక్రమాలు, ఉత్సవాలపై నిబంధనలు విధించాయి.

నిత్యం విగ్రహాల తయారీ పై ఆధారపడ్డ వేల కుటుంబాలు సరిగా పనిలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ రంగంలోనే మొదటి నుంచి బతుకు సాగిస్తున్నామని, వేరే వృత్తులు చేయలేక వీటిపైనే ఆధారపడుతున్నామంటున్నారు. తయారు చేసిన విగ్రహాలు కుడా అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తయారు చేసిన కొద్ది బొమ్మలకు గిరాకీలేక బోరుమంటున్నారు.



Tags:    

Similar News