భక్తులు లేకుండానే కదలనున్న జగన్నధుని రథచక్రాలు

Update: 2020-06-23 03:28 GMT

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూరీ జగన్నథ రథయాత్ర జరుగుతుందో లేదో అనే సందేహాలకు తెరపడిన సంగతి తెలిసిందే. భక్తుల తాకిడి లేకుండా రథ యాత్ర నిర్వహించుకునేందుకు సుప్రీంకోర్టుకు అనుమతి ఇచ్చింది. రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని చెప్పిన ధర్మాసనం.. కొన్ని షరతులతో రథయాత్ర నిర్వహణకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మంగళవారం పూరీలో రథయాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం అయింది.

కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఉత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం లో తిలకించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. కాగా.. 12 రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే జగన్నాథ రథోత్సవాలను నిర్వహించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 45 అడుగుల ఎత్తుతో 16 చక్రాలతో జగన్నాథుని రథం, 44 అడుగుల ఎత్తుతో 14 చక్రాలతో బలభద్రుని రథం, 43 అడుగుల ఎత్తుతో 12 చక్రాలతో సుభద్ర రథాలను సిద్దం చేశారు. భక్తులు తరలి రాకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా సుప్రీం కోర్టు సూచనల ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

మరోవైపు ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయకపోతే ప్రజలు రథయాత్రకు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం పూరీలో 40 గంటల పాటు పూర్తి స్థాయి షట్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం సాయత్రం నుంచి బుధవారం వరకు షట్ డౌన్ విధించింది.

అంతకుముందు కరోనా వ్యాప్తి నేపథ్యంలో రథయాత్రకు సుప్రీంకోర్టు స్టే విధించింది. జూన్‌ 23న నిర్వహించకుంటే 12ఏళ్ల వాయిదా వేయాల్సి వస్తుందని, యాత్రకు అనుమతి ఇవ్వాలని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. దీనికి ఒడిశా ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. సుప్రీంకోర్టు తమ ఆదేశాలను పునర్‌ సమీక్షించింది. జగన్నాథ రథయాత్రకు అనుమతిస్తూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని దినేష్ మహేశ్వరి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. భక్తులు లేకుండానే యాత్ర నిర్వహించాలని సూచించింది. కేవలం పూరీలో మాత్రమే జగన్నాథ రథ యాత్ర నిర్వహించాలని సూచించింది.


Tags:    

Similar News