Coronavirus: దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కేసులు

Coronavirus: మూడు రోజుల్లో లక్ష పాజిటివ్‌ కేసులు నమోదు * నిన్న ఒక్కరోజే కొత్తగా 40,953 కేసులు, 188 మరణాలు

Update: 2021-03-21 04:49 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Coronavirus: భారత్‌లో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో గత మూడు రోజుల్లో లక్ష పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 40 వేల 953 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. గతేడాది నవంబర్‌ తరువాత ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు నిన్న కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా 188 మంది మృతి చెందారు.

ఇక భారత్‌లోని 8 రాష్ట్రాల్లో కొవిడ్‌ ఉధృతి పెరుగుతున్నట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో 76.22 శాతం యాక్టివ్‌ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2లక్షల 88వేల 394 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 62శాతం యాక్టివ్‌ కేసులు నమోదైనట్టు స్పష్టం చేసింది కేంద్ర వైద్యారోగ్యశాఖ.

మరోవైపు భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ చురుగ్గా సాగుతోంది. దేశవ్యాప్తంగా నిన్నటి వరకు 4.36 కోట్ల మందికి కరోనా టీకా అందించారు. నిన్న ఒక్కరోజే 16 లక్షల 12 వేల మందికి కరోనా వ్యాక్సిన్‌ వేశారు. ఇప్పటివరకు 77 లక్షల 63 వేల మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్‌ తీసుకున్నారు. మరో 48 లక్షల 51 వేల మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ రెండో డోస్‌ వేశారు. 80 లక్షల 49 వేల మంది కరోనా యోధులకు మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వగా.. 25 లక్షల 41 వేల మంది కరోనా యోధులకు రెండో డోస్‌ అందించారు. 

Tags:    

Similar News