Congress: 85వ ప్లీనరీకి సన్నద్ధమవుతున్న కాంగ్రెస్

Congress: ఫిబ్రవరి 24 నుంచి రాయ్‌పూర్‌లో మూడురోజుల సమావేశాలు

Update: 2023-02-22 08:41 GMT

Congress: 85వ ప్లీనరీకి సన్నద్ధమవుతున్న కాంగ్రెస్

Congress: కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే ప్లీనరీని ఛత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించనుంది కాంగ్రెస్. ఈ ప్లీనరీతో పార్టీని బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా మార్చాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే CWC సభ్యులకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్‌ జోడో యాత్ర ప్రభావంతోనే CWC సభ్యుల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల ద్వారా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సంబంధాలు బలపడి పార్టీని బలపరిచేందుకు నిబద్ధతతో వ్యవహరిస్తారని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అయితే CWC ఎన్నికల నిర్వహణపై ప్లీనరీ తొలిరోజు స్టీరింగ్ కమిటీ సమావేశమై తుది నిర్ణయం ప్రకటించనుంది.

బీజేపీకి బలమైన ప్రత్యా్మ్నాయంగా మారాలంటే మరింత విస్తృతంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం ముఖ్యం. ఇందుకు రాయ్‌పూర్‌లో జరిగే ప్లీనరీనే కీలకంగా మారనుంది. కార్యకర్తలకు, నేతలకు మధ్య సంబంధాలు బలపరచేందుకు సీడబ్ల్యుసీ ఎన్నికలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. కాంగ్రెస్ అధినేతను మినహాయిస్తే సిడబ్ల్యూసి లోని 24 మందిలో 12 మందిని అధ్యక్షుడు నియమించనుండగా మరో 12 మందికి ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి సిడబ్ల్యూసిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతం పదవులు ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్. యువత పాత్రను పెంచేందుకు 50 ఏళ్ల లోపు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది.

అటు సభ్యత్వ రుసుం కూడా పెంచనుంది కాంగ్రెస్. నిధుల కొరతను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రతీ ఏఐసీసీ ప్రతినిధి సభ్యత్వ రుసుము మూడు వేల రూపాయలకు పెంచిన అధిష్టానం డెవలప్‌మెంట్‌ కోసం ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అటు పీసీసీ సభ్యత్వ రుసుం కూడా వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచనున్నారు.

Tags:    

Similar News