Chirag Paswan: పడి లేచిన కెరటం... అవమానాల నుంచి అద్భుత విజయం వైపు... పోటీ చేసిన స్థానాల్లో 72 శాతం స్ట్రైక్ రేట్... లోక్ జనశక్తి పార్టీ సత్తాకు కారణం ఏంటి...? యువ బిహారీ చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎలా సత్తా సాధించింది..?
బిహార్ విజయంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలు సత్తా చాటాయి. కూటమిలోని లోక్‌జన్ శక్తి రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ 28 స్థానాల్లో పోటీ చేసింది. ఇక హిందూస్థానీ అవామ్ మోర్చా 6 , రాష్ట్రీయ లోక్‌మోర్చా 6 స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని లోక్‌జన్ శక్తి పార్టీ తమ ప్రభావాన్ని చూపింది. దాదాపు 71శాతం స్టైక్ రేట్‌తో స్థానాలను కైవసం చేసుకుంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదుకు ఐదు స్థానాల్లో గెలిచారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జోష్ కొనసాగించారు. సాధించిన స్థానాలతో ఆయన రాజకీయ పలుకుబడి మరింత పెరిగింది.
చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష‌్యత్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌తో విభేధాలతో పార్టీ ఒంటరిగా బరిలో దిగింది. 137 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. జేడీయూ ఓటమికి పలుచోట్ల కారణమైందని చెప్పవచ్చు. 2015లో 75 సీట్లు సాధించిన జేడీయూ... 2020 ఎన్నికల్లో 43సీట్లకే పరిమితమైంది. దివంగత నేత రాంవిలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని ముందుకు నడిపించే సత్తా, కరిష్మా చిరాగ్‌కు లేవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
2021లో సొంత బాబయ్ పశుపతి కుమార్ పరాస్ పార్టీని చీల్చి రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం పోటీ పడటంతో చిరాగ్ పరిస్థితి మరింత దిగజారింది. పార్టీ ఎంపీలు ప్లేటు ఫిరాయించడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం పార్టీ గుర్తును హోల్డ్ చేసింది. 2021లో ఎల్‌జేపీ రాంవిలాస్ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చిరాగ్ అద్బుతంగా పుంజుకున్నారు. 43ఏళ్ల చిరాగ్ తనను తానుగా యువ బిహారీగా ప్రొజెక్టు చేసుకున్నారు. పార్టీ మూలాలైన దళిత సమస్యలపై పోరాటాలు చేశారు. ఆయన కృషి ఫలించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 100శాతం విజయం కట్టబెట్టింది. తాజా ఎన్నికల్లో దూసుకెళ‌్లడంతో ఏపీలోని జనసేన పార్టీతో పలువురు పోలుస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా మారిన చిరాగ్ పాశ్వాన్‌కు ఏ పదవి లభిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.