ఎర్రకోట ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్‌

రైతులు చేపట్టిన ర్యాలీ రణరంగంగా మారడంపై కేంద్ర హోంశాఖ సీరియస్‌ అయ్యింది.

Update: 2021-01-27 13:08 GMT

RedFort File Photo

రైతులు చేపట్టిన ర్యాలీ రణరంగంగా మారడంపై కేంద్ర హోంశాఖ సీరియస్‌ అయ్యింది.కిసాన్‌ పరేడ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై అత్యవసర సమావేశాలు నిర్వహించింది. అలాగే ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగరేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు జరిపిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంది. ఉద్రిక్తతలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగురవేసిన ఘటనపై హోంశాఖ దృష్టి పెట్టింది. అటు జెండాలు ఎగురవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

ఐబీ చీఫ్‌తో సమావేశమైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దోషులను గుర్తించాలని సూచించారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే 35 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని.. 200 మంది నిందితులను గుర్తించినట్లు వివరించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్.. తమతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 1న రైతు సంఘాలు పార్లమెంట్‌ ర్యాలీ తలపెట్టాయి. అయితే నిన్నటి ఢిల్లీ ఘటన కారణంగా రైతులు పునరాలోచన లో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు కిసాన్‌ గణతంత్ర పరేడ్‌ హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో రైతులు నిబంధనల్ని అతిక్రమిస్తూ ఎర్రకోటపై వేరే జెండా ఎగురవేశారని.. ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పేర్కొన్నారు.

ఏదీఏమైనా.. చర్చలతో పరిష్కరించుకోవాల్సిన సమస్య ఇప్పుడు సున్నితఅంశంగా మారిపోయింది. మరోవైపు.. రైతులు ఇలాంటి ఘటనలకు పాల్పడకపోయి ఉంటే బాగుండేదని యావత్‌ భారత్‌ భావిస్తోంది.

Tags:    

Similar News