PFI: పీఎఫ్‌ఐపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

PFI: పీఎఫ్‌ఐ అసోసియేట్‌లు, అనుబంధ సంస్థలను చట్టవిరుద్ధ సంఘంగా ప్రకటన

Update: 2022-09-28 03:53 GMT

PFI: పీఎఫ్‌ఐపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

PFI: PFI సంస్థను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. UAPA యాక్ట్ కింద వాటిపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు కేంద్రహోంశాఖ గెజిట్ విడుదల చేసింది. PFIతో పాటు దాని అనుబంధ సంస్థలను కూడా చట్ట విరుద్ధమైన సంస్థలుగా ప్రకటించింది. ఇకపై మనదేశంలో ఈ సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ 2006లో ఏర్పాటయింది. మొదట కేరళలో ప్రారంభమై.. ఆ తర్వాత దేశమంతటా విస్తరించింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల సాధికారతే లక్ష్యంగా పనిచేయనున్నట్లు పేర్కొంది. అందుకోసం సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ముసుగులో రాడికల్ ఇస్లాంను ప్రచారం చేస్తోందని భద్రతా సంస్థలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వడం, హింసాత్మక ఘటనలకు పాల్పడడం, కరాటే పేరుతో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం, అమాయక యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు ప్రోత్సహించడం.. వంటి కార్యకలాపాలు చేస్తున్నట్లు PFIపై ఆరోపణలున్నాయి.

సెప్టెంబరు 22న PFIపై NIA మెరుపు దాడులు చేసింది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్, రాజస్థాన్ సహా మొత్తం 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. PFI కార్యాలయాలు, నేతలు, కార్యకర్తల ఇళ్లల్లో సోదాలు చేసి.. దాదాపు వంద మందికి పైగా అరెస్ట్ చేసింది. సోదాల్లో ల్యాప్‌టాప్స్, పెన్‌డ్రైవ్స్ సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నేతల విచారణలో కీలక వివరాలను రాబట్టారు.

నిన్న కూడా పలు రాష్ట్రాల్లో సోదాలు జరిగాయి. అస్సాంలో 25 మందిని, మహారాష్ట్రలో నలుగురు, ఢిల్లీలో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 21 మందిని, గుజరాత్‌లో 10 మందిని, కర్ణాటకలో కూడా చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News