Parliament: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా

Parliament: రెండురోజుల ముందే ఉభయ సభలు ముగింపు * షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు సభలు

Update: 2021-08-12 02:34 GMT

పార్లమెంట్ సెషన్ ముగిసిన తరువాత ప్రధాని తో సమావేశం అయిన ఓం బిర్లా (ఫైల్ ఇమేజ్)

Parliament: పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ ముందే ముగిశాయి. ఉభయ సభల ప్రారంభం నాటి నుంచే పెగాసస్ రగడ రాజుకుంది. ఆరోజు నుంచి ముగింపు క్షణాల వరకూ ఒక్కరోజు కూడా సభలు సవ్యంగా సాగలేదనే చెప్పాలి. పెగాసస్ పై చర్చ జరగాల్సిందే అని విపక్షాలు, అభ్యంతరం లేదంటూనే అధికార పక్షం కాలం గడిపేశాయి.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు రెండు రోజుల ముందే ముగిశాయి. రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. జూలై 19న ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్‌13 వరకు జరగాల్సి ఉన్నా... ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. పెగాసస్‌ వివాదం, రైతుల నిరసనలు, ఇతర సమస్యలపై చర్చ కోసం పట్టుబడుతూ, బిల్లుల ప్రవేశాన్ని అడ్డుకుంటూ సభలో గందరగోళం సృష్టించాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం లోక్‌సభ నిరవధిక వాయిదా పడగా, సాయంత్రం రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. దీంతో షెడ్యూల్‌ కన్నా రెండు రోజుల ముందుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి.

ఈసారి లోక్‌సభా కార్యక్రమాలు అనుకున్నట్లు సాగలేదు.. కేవలం 22శాతం మాత్రమే ప్రొడక్టివిటీ రికార్డయింది.. ఈ మాటలు సాక్షాత్తూ స్పీకర్ ఓంబిర్లా చెప్పినవే.. మొత్తం 74 గంటల 46 నిమిషాల పాటు లోక్‌సభ జరిగందన్న స్పీకర్.. 20 బిల్లులు పాసయ్యాయని వివరించారు. అదే సమయంలో ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించారని వెల్లడించారు. మరోవైపు వర్షాకాల సెషన్‌లో రాజ్యసభ 28 శాతం ప్రొడక్టివిటీని నమోదు చేసింది. సభలో మొత్తం 17 సమావేశాలు, 28 గంటల 21 నిమిషాల పాటు జరిగాయి. అంతరాయాల కారణంగా 76 గంటల 26 నిమిషాలు వృథా అయ్యాయి. 19 బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాయి.

రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు కంటతడిపెట్టారు. సభలో ఎంపీల ప్రవర్తనపై ఆయన కలతచెందారు. సభలో వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం రాజ్యసభలో రైతు సమస్యలపై చర్చ సందర్భంగా గందగోళం సృష్టించిన ఎంపీలపై చర్యలు తీసుకోనున్నారు వెంకయ్యనాయుడు. రాజ్యసభలో విపక్ష ఎంపీల అనుచిత ప్రవర్తనను రాజ్యసభ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు అమిత్ షా, పియూష్ గోయల్. సభా నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడును కోరారు.

పార్లమెంట్ సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్ తో ఫోన్ల హ్యాకింగ్ కథనాలు రావడంతో.. ఈ వ్యవహారం పార్లమెంట్ ను కుదిపేసింది. ఆరోజు నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో పెగాసస్ ప్రకంపనలు ఓ రేంజ్‌లో సాగాయి. అయితే, పెగాసస్‌పై చర్చ, విచారణ కోసం ఇంతలా పట్టుబట్టిన విపక్షాలు సాధించింది ఏంటి..? 130 కోట్ల భారతీయుల్లో ఉత్పన్నమవుతున్న ప్రశ్నే ఇది.

Tags:    

Similar News