Amit Shah: దాచడానికి, భయపడ్డానికి ఏమీ లేదు..అదానీ ఇష్యూపై అమిత్ షా
Amit Shah: విపక్షాల ఆరోపణలకు భయపడటం లేదన్న అమిత్ షా
Amit Shah: దాచడానికి, భయపడ్డానికి ఏమీ లేదు..అదానీ ఇష్యూపై అమిత్ షా
Amit Shah: పార్లమెంట్ ఉభయ సభల్లోనేకాక దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన గౌతమ్ అదానీ ఇష్యూపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. బీజేపీ ఈ విషయంలో ఏమీ దాచడం లేదని, దేనికీ భయపడడం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయ విచారణ పరిధిలో ఉన్నందున తాను మాట్లాడడం సరికాదన్నారు. ఆశ్రిత పక్షపాతం అంటూ మోడీ సర్కార్‌ను విపక్షాలు ఎండగట్టాయి. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే షార్ట్ సెల్లర్ అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో, షేరు ధరల్లో అవకతవకలు ఉన్నాయంటూ జనవరి చివర్లో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ తర్వాత అదానీ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలను చవిచూశాయి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఈ అంశంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అసలు పోటీయే లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని మాత్రమే ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. గత ఎన్నికల్లో ఈ అవకాశాన్ని ఏ పార్టీకి వారు ఇవ్వలేదని షా గుర్తు చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ప్రధాని మోడీకే మరోసారి పట్టం గడతారని ధీమా వ్యక్తం చేశారు.
ANI వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా ఈమేరకు బదులిచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపుర, నాగలాండ్, మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో తేలిపోతుందన్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.