BJP: హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు.. సమావేశానికి హాజరుకానున్న 38 పార్టీలు
BJP: ఢిల్లీలో ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల సమావేశం
BJP: హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు.. సమావేశానికి హాజరుకానున్న 38 పార్టీలు
BJP: టార్గెట్ బీజేపీ ఇప్పుడు ఇదే విపక్షాల లక్ష్యం. ఈ లక్ష్యం దిశగానే ఇప్పుడు విపక్షాలన్నీ అడుగులు వేస్తున్నాయి. బీజేపీని ఏలాగైనా గద్దే దించేందుకు ఒక్కతాటిపైకి వచ్చి చర్చలు జరుపుతున్నాయి. ఎన్నికల షెడ్యుల్‌కు ఇంకా సమయమున్నా... ఇప్పటి నుంచి పోరు ప్రారంభిస్తే కానీ... టార్గెట్ రీచ్ కాలేమన్న ఆలోచనలో ఉన్నాయి.
బీజేపీపై యుద్ధం చేసేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటోంది కాంగ్రెస్. అందుకోసం బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలకు పెద్దపీఠ వేస్తోంది. కర్ణాటకలో ఘనవిజయం స్ఫూర్తితో బీజేపీని 2024 ఎన్నికల్లో ఓడించేందుకు... కాంగ్రెస్, ఇతర విపక్షాలు సంఘటితమవుతున్నాయి. కొత్త కూటమి ఏర్పాటు దిశగా నిన్న సమావేశమైన 26 విపక్షాలు.. ఇవాళ కూటమి పేరు, దాని సారథి, పొత్తులపై చర్చించనున్నాయి.
తమిళనాడులో గవర్నర్ ద్వారా తమ ప్రభుత్వాన్ని కేంద్రం ఇబ్బందులు పెడుతుందని... సీఎం స్టాలిన్ ప్రాథమిక చర్చల్లో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల విషయంలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. ఈడీ, సీబీఐ ద్వారా ప్రతిపక్షాల గొంతునొక్కేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని, మహారాష్ట్రలో సాగుతున్న తంతు కూడా ఇందులో భాగమే అని వేణుగోపాల్ ఆరోపించారు. భారత్ జోడో యాత్రతో బీజేపీలో భయం ఏర్పడిందని.. ప్రతిపక్షాల సభతో మోదీకి ఎన్‌డీఏ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు.
దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ అమల్లో ఉన్న పలు ఉచిత పథకాలను 2024 లోక్‌సభ ఎన్నికల ఉమ్మడి ఎజెండాలో చేర్చే అంశంపై ప్రతిపక్షాల సమావేశం దృష్టి సారించనుంది. సోమవారం బెంగళూరులో విందు సమావేశంలో రాహుల్‌గాంధీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఐదు గ్యారెంటీ ఉచిత పథకాలు ఇటీవల కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టాయి. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఏయే ఉచిత పథకాలు చేర్చాలో కసరత్తు జరుగుతోంది. ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లోనూ ఉచిత పథకాలనే ప్రచార అస్త్రాలుగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మరోవైపు మోడీ నాయకత్వంలో 2024లో కూడా నెగ్గి హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ.. ఢిల్లీలో ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల సమావేశం నిర్వహిస్తోంది. దీనికి 38 పార్టీలు హాజరు కానున్నాయి. ప్రతిపక్షాలను చీల్చడం ద్వారా వాటిని బలహీనపరచి.. సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను ఎన్‌డీఏలో చేర్చుకుని మూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా మోడీ పావులు కదుపుతున్నారు. శివసేన, ఎన్‌సీపీలను ఇలాగే చీల్చారు. చీలిక వర్గం నేతలైన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భేటీకి హాజరు కానున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలు ఏకతాటిపైకి రావడం కీలక పరిణామంగా మారింది. అయితే విపక్ష కూటమి ఎదుర్కొనేందుకు అధికార బీజేపీ సైతం వ్యూహాలు రచిస్తుండటం.. అందుకోసం కలిసి వచ్చే పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ఉత్తరాదిలో బలంగానే ఉన్న బీజేపీకి విపక్ష కూటమి కారణంగా భారీ దెబ్బపడే అవకాశం ఉంది. దాని కోసం దక్షిణాదిలో బలం పుంజుకుని ఆ లోటును భర్తీ చేయాలన్న యోచనలో కమల అధినాయక్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, విపక్షాల చర్చలు సఫలీకృతమైతే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొక తప్పదన్న అంచనాలున్నాయి.