ఇవాళ గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్

* తొలిసారి ఎమ్మెల్యే అయినా వరించిన సీఎం పదవి * భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న అమిత్ షా

Update: 2021-09-13 04:41 GMT

భూపేంద్ర పటేల్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Bhupendra Patel: గుజరాత్‌ కొత్త సీఎం నియామకం విషయంలో బీజేపీ హైకమాండ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు బీజేపీకి చెందిన 112 మంది ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకున్నారు. బీజేపీ జాతీయ పరిశీలకులు నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ జోషి, ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. భూపేంద్ర పటేల్‌ పేరును మాజీ సీఎం విజయ్‌ రూపానీ ప్రతిపాదించగా, ఇతర సభ్యులు మద్దతు పలికారు. అనంతరం భూపేంద్రపటేల్‌ గవర్నర్‌ను కలిసి శాసనసభాపక్ష నేతగా తన ఎన్నికకు సంబంధించిన లేఖను సమర్పించారు.

ఇక ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఇవాళ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్ర మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్‌ ప్రస్తుత గవర్నర్‌ ఆనందీబెన్‌కు అనుయాయుడైన భూపేంద్ర గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా స్థానం నుంచే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2015-2017 మధ్య అహ్మదాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. 2010-2015 మధ్య అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా భూపేంద్ర పటేల్‌కు పేరుంది.

గుజరాత్‌ రాష్ట్ర జనాభాలో 12శాతం దాకా ఉన్న పటేళ్లు తమకు బీసీ హోదా కల్పించాలంటూ 2015లో పెద్ద ఎత్తున పటీదార్‌ ఉద్యమం నిర్వహించారు. అప్పటి నుంచి బీజేపీకి పటేల్‌ వర్గం మద్దతు తగ్గుతూ వచ్చింది. అప్పటికే మాజీ సీఎం కేశూభాయ్‌ పటేల్‌కు ప్రాబల్యం కూడా తగ్గడంతో బీజేపీ పట్ల ఆ వర్గం విముఖంగా ఉంటోంది. ఆ పార్టీకి 2012 ఎన్నికల్లో 60శాతం వచ్చిన ఓట్లు.. 2017లో 49శాతానికి పడిపోయాయి.

మరోవైపు కాంగ్రెస్‌ ఓట్లు 33 నుంచి 41.4 శాతానికి పెరిగింది. దీనికి తోడు రాష్ట్రంలో 2శాతం మాత్రమే ఉన్న జైన్‌ వర్గానికి చెందిన విజయ్‌ రూపానీని ముఖ్యమంత్రిగా నియమించడంతో పటీదార్లలో వ్యతిరేకత మరింత పెరిగింది. దీంతో ఆ వర్గాన్ని తిరిగి తమవైపు తిప్పుకొనేందుకు చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో గుజరాత్‌ నుంచి ఏడుగురికి అవకాశం కల్పించగా వారిలో పటేల్‌ వర్గానికి చెందిన మన్సుఖ్‌ మాండవీయ, పురుషోత్తం రూపాలాకు కేబినెట్‌ హోదా కల్పించారు. తాజాగా భూపేంద్ర పటేల్‌ను సీఎంను చేసి పటేల్‌ వర్గాన్ని తృప్తి పరిచారు.

Tags:    

Similar News