Bhupendra Patel: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్

Bhupendra Patel: ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీజేపీ శాసనసభాపక్షం

Update: 2021-09-12 11:27 GMT

గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్

Bhupendra Patel: నిన్నటి నుంచీ ఊహించని మలుపులు తిరిగిన గుజరాత్‌ పాలిటిక్స్‌లో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేసిన అనంతరం గుజరాత్ నయా సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ పీక్స్‌కు చేరిన వేళ.. అనూహ్యంగా భూపేంద్ర పటేల్ పేరు తెరపైకి వచ్చింది. దాదాపు గంటపాటు జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో భూపేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసలు విజయ్ రాజీనామాకు భూపేంద్ర ఎన్నికకు మధ్య చోటుచేసుకున్న ట్విస్టులేంటి..? 

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని విధంగా సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. రాజీనామా చేసిన దగ్గర నుంచి విజయ్ వారసుడు ఎవరన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తెరపైకి కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ సహా నాలుగు పేర్లు వచ్చినప్పటికీ ఊహించని విధంగా చివరి క్షణాల్లో భూపేంద్ర పటేల్ పేరు తెరపైకి వచ్చింది. దాదాపు గంటపాటు జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పటేల్ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మొదట గుజరాత్ సీఎం రేసులో కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ, సీఆర్. పాటిల్ పేర్లు బలంగా వినిపించినా.. తాజా-మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అనూహ్యంగా భూపేంద్ర పటేల్ పేరు సూచించారు. దీంతో సభ్యులందరూ భూపేంద్రకే జై కొట్టారు. నిజానికి గతఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కిన బీజేపీ వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు నాయకత్వ మార్పుతో బరిలో దిగాలని భావించింది. దీనికి తోడు గుజరాత్‌లో బలమైన సామాజిక వర్గం అయిన పటేళ్లను ప్రశన్నం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకే అని భావించింది. అందులో భాగంగా రూపానీ రాజీనామా... భూపేంద్ర పటేల్ ఎంపిక జరిగిపోయింది.

ఇక.. గుజరాత్ నయా సీఎం భూపేంద్ర పటేల్.. గతంలో ఆనందిబెన్ ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి భూపేంద్ర లక్షా 17 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గానూ భూపేంద్ర పటేల్ వ్యవహరించారు. మొత్తానికి భేపేంద్ర ఎన్నికతో విజయ్ రూపానీ వారసుడు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.

Tags:    

Similar News