Bharat Taxi: రూ.500లతో ఓనర్ అవ్వండి.. డ్రైవర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చిన అమిత్ షా !
Bharat Taxi: రూ.500లతో ఓనర్ అవ్వండి.. డ్రైవర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చిన అమిత్ షా !
Bharat Taxi: రూ.500లతో ఓనర్ అవ్వండి.. డ్రైవర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చిన అమిత్ షా !
దేశంలోని క్యాబ్, ఆటో డ్రైవర్ల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా 'భారత్ టాక్సీ' అనే సహకార ఆధారిత (Co-operative) క్యాబ్ సర్వీస్‌ను ప్రారంభించారు. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, డ్రైవర్లే సంస్థకు యజమానులుగా ఉండేలా ఈ వేదికను రూపొందించినట్లు తెలిపారు. తాజాగా ఢిల్లీ-ఎన్‌సిఆర్, గుజరాత్ డ్రైవర్లతో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. భారత్ టాక్సీ గురించి పలు విశేషాలను వెల్లడించారు. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కేవలం రూ. 500 విలువైన వాటాను (Share) కొనుగోలు చేయడం ద్వారా ప్రతి డ్రైవర్ ఈ సంస్థకు సహ యజమాని కావచ్చని ఆయన అన్నారు. 36 లక్షల మంది మహిళలు ఒక్కొక్కరు రూ.50 పెట్టుబడితో రూ. 1.25 లక్షల కోట్ల టర్నోవర్ సాధించిన 'అమూల్' విజయగాథను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రైవేట్ డైరీల్లో లాభం యజమానికి వెళ్తే, అమూల్‌లో 85% వాటా ఉత్పత్తిదారులకే అందుతుందని, భారత్ టాక్సీ కూడా అదే సూత్రంతో పనిచేస్తుందని తెలిపారు.
భారత్ టాక్సీకి వచ్చే లాభాల్లో 80 శాతం డ్రైవర్లు నడిపిన కిలోమీటర్ల ఆధారంగా తిరిగి వారికే పంపిణీ అందుతుందన్నారు. మిగిలిన 20% నిధులను సంస్థ నిర్వహణ కోసం కేటాయిస్తారన్నారు. ప్రైవేట్ కంపెనీల్లా కాకుండా, కిలోమీటరుకు కనీస బేస్ రేటును ఈ ప్లాట్‌ఫామ్ గ్యారెంటీ ఇస్తుంది. తద్వారా డ్రైవర్లకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని చెప్పారు. సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ భారత్ టాక్సీ డైరెక్టర్ల బోర్డులో డ్రైవర్ల ప్రతినిధులకు సీట్లు కేటాయిస్తారని, దీనివల్ల డ్రైవర్ల సమస్యలపై బోర్డులో ప్రశ్నించే అధికారం వారికి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సిఆర్ మరియు రాజ్‌కోట్‌లలో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్‌ను, మూడేళ్లలోపు మునిసిపల్ కార్పొరేషన్ ఉన్న ప్రతి నగరానికి విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రాబోయే రెండేళ్లలో 15 కోట్ల మంది డ్రైవర్లను ఈ సహకార సంస్థలో సభ్యులుగా చేర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు. "డ్రైవర్ల సంక్షేమం - దేశాభివృద్ధి" అనే నినాదంతో వస్తున్న భారత్ టాక్సీ, కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యానికి సరైన ప్రత్యామ్నాయంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.