దేశంలో స్వాతంత్ర్యం హరించిందన్న రాహుల్‌ గాంధీ

*మహాత్ముడిని చంపిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా చేసే పోరాటమే భారత్‌ జోడో యాత్రని వెల్లడి

Update: 2022-10-02 14:45 GMT

దేశంలో స్వాతంత్ర్యం హరించిందన్న రాహుల్‌ గాంధీ

Bharat Jodo Yatra: మహాత్ముడిని చంపిన సిద్ధాంతంపై పోరాటానికే భారత్‌ జోడో యాత్ర చేపట్టినట్టు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. కర్ణాటకలోని మైసూరు జిల్లా బదనవాలులోని ఖాధఈ గ్రామోద్యోగ్‌ కేంద్రంలో నిర్వహించిన గాంధీ జయంతి ఉత్సవాల్లో రాహుల్‌ పాల్గొన్నారు. దేశ ప్రజలు కష్టపడి సంపాధించుకున్న స్వతంత్రం.. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో హరించుకుపోయిందని రాహుల్‌ విమర్శించారు. బ్రిటిష్‌ పాలకులతో గాంధీజీ పోరాడినట్టే.. ఆయనను చంపిన భావజాలంపైన మనం యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ భావజాలం కారణంగా ఎనిమిదేళ్లలో అసమానత, విభజనలతో పాటు స్వతంత్రం హరించివేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ హింస, అసత్య రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రస్తుతం స్వరాజ్యం అంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

కర్ణాటకలో 21 రోజుల పాటు జరిగే భారత్ జోడో యాత్ర మూడో రోజుకు చేరుకుంది. గాంధీజీ రెండు సార్లు సందర్శించిన బదనవాలు ఖాదీ కేంద్రంలో మహాత్ముడి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతర ప్రార్థనల్లో పాల్గొన్న రాహుల్... నలుగురు దళిత మహిళలతో కలిసి భోజనం చేశారు. అక్కడి ఖాదీ కార్మికులతో రాహుల్ ముచ్చటించారు. అనంతరం పాదయాత్ర కడకోల ఇండస్ట్రియల్ జంక్షన్ వద్ద ముగిసింది. అక్కడి నుంచి మైసూరులోని జేఎస్ ఎస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు సాగింది. కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర 8 జిల్లాల గుండా 511 కిలోమీటర్ల మేర సాగనున్నది. ఈ యాత్రలో మొత్తం 7 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు 22 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి.

ఇక గుండ్లుపేట, మైసూర్‌, బళ్లారిలో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్టు కేపీసీసీ ప్రకటించింది. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా నుంచి.. రాహుల్‌ యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనున్నది. అక్టోబరు 24న రాయచూర్‌ జిల్లా నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌లో తెలంగాణలో ప్రేవేశించి.. 366 కిలోమీటర్లమేర సాగనున్నది. మొత్తం నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లోని 9 అసెంబ్లీల్లో రాహుల్‌ యాత్ర సాగనున్నది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర.. 150 రోజుల పాటు సాగనున్నది. ఈ యాత్ర మొత్తం 3వేల 570 కిలోమీటర్ల మేర సాగనున్నది.సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో జోడో యాత్రను రాహుల్‌ గాంధీ ప్రారంభించిన ఈ పాదయాత్ర.. జమ్మూ కశ్మీర్‌లో ముగుస్తుంది. 

Tags:    

Similar News