BA Aloor Passes Away: సంచలన కేసులు వాదించే ఫేమస్ క్రిమినల్ లాయర్ బి.ఏ. ఆలూర్ ఇక లేరు
BA Aloor's death news: బి.ఏ. ఆలూర్... సంచలనం సృష్టించిన కేసులను, వాటి న్యాయ పరమైన అంశాలను పరిశీలించే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఎందుకంటే సంచలనం సృష్టించిన అనేక కేసులను వాదించిన ప్రముఖ న్యాయవాదిగా ఆయనకు పేరుంది. ఆయన ఇక లేరు. బి.ఎ. ఆలూర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో పడుతూ కొచ్చిలోని లిసి హాస్పిటల్‌లో కన్నుమూశారు. కేరళలోని త్రిచూర్ సమీపంలోని ఎరుమపెట్టి ఆయన స్వస్థలం.
బి.ఏ. ఆలూర్ పూర్తి పేరు బిజు ఆంటోనీ ఆలూర్. ఆయనకు పెళ్లి చేసుకోలేదు. త్రిచూర్‌లో తన తోబుట్టువులతో ఉంటున్నారు. ఎంతో వివాదాస్పదమైన, సంక్లిష్టమైన, సంచలనం సృష్టించిన కేసుల్లో వాదించడంలో ఆలూర్ దిట్ట. అందులో కొన్ని కేసుల్లో ఆయన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి తరపున కూడా కేసులు వాదించారు.
కేరళలో 2011 సౌమ్య అనే యువతిని రైలులో ప్రయాణిస్తున్న సమయంలో రేప్ చేసి చంపేశారు. ఆ కేసులో నిందితుల తరపున కేసు వాదించారు.
2016 లో పెరుంబవూర్ లో జిష మర్డర్ కేసు సంచలనం సృష్టించింది. ఆ కేసును కూడా ఆలూర్ టేకప్ చేశారు.
కూడతాయి సెనైడ్ మర్డర్స్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులోనూ ఆలూర్ న్యాయవాదిగా వ్యవహరించారు.
ఎలంతూర్ నరబలి కేసు, వరకట్నం వేధింపులతో చనిపోయిన విస్మయ కేసును కూడా ఆయనే వాదించారు.
1999 లో న్యాయవాదిగా కేసులు వాదించడం మొదలుపెట్టిన ఆలూర్ అతి కొద్దికాలంలోనే క్రిమినల్ కేసుల లాయర్‌గా ఫేమస్ అయ్యారు. ఆయన కేసు వాదిస్తే అవతలి లాయర్‌కు పాయింట్ చిక్కకుండా ఉంటుందంటారు.
2024 ఫిబ్రవరిలో ఆయనే స్వయంగా పోక్సో కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కున్నారు. ఒక బిజినెస్ లోన్ గురించి చర్చించేందుకు వచ్చిన ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనేది ఆలూర్‌పై నమోదైన అభియోగం. ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్ లో ఆలూర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.