Ayodhya: అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం

Ayodhya: రాముడి నుదుటన సూర్య కిరణాలు

Update: 2024-04-17 02:34 GMT

Ayodhya: అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం

Ayodhya: దేశ వ్యాప్తంగా జై శ్రీరామ్ నినాదం మార్మోగుతోంది. ముఖ్యంగా శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ‌్య వీధుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 500 ఏళ్ల నాటి వివాదం ముగిసిపోయి.. ఇటీవలె అయోధ్యలో దివ్య రామ మందిరం ప్రారంభమైంది. జనవరి 22వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన అయోధ్య రామాలయానికి ఇదే తొలి శ్రీరామనవమి. ఈ ఉత్సవాల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది.

500 ఏళ్ల తర్వాత అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా జయంతి వేడుకలు జరగనున్న నేపథ్యంలో.. అయోధ్యలో రామజన్మోత్సవం శోభ సంతరించుకుంది. అయోధ్యలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచే అయోధ్య రామ నవమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. రామ్‌నగరిలోని 8 వేల మఠాలు, దేవాలయాలలో అభినందన పాటలు, వివిధ ఆచారాలు ప్రారంభం అయ్యాయి. ఇక రామ్ జన్మోత్సవ్ శుభ సమయంలో.. రామ్ లల్లాను చైత్ర ప్రతిపాద నుంచి రామ నవమి వరకు ఖాదీతో చేసిన ప్రత్యేక దుస్తులతో అలంకరించనున్నారు.

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నేడు అయోధ‌్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు రామతీర్థ్ క్షేత్ర ట్రస్ట్ నిర్వహకులు ఏర్పాట్లు చేశారు. సూర్యకిరణాల ప్రసరణ ఏర్పాట్లను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ‘‘ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన కిరణాలతో ‘తిలకం’ ఏర్పాటుచేయడమే సూర్య తిలక్‌ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. చైత్రమాసంలో వచ్చే ఈ పండుగ వేళ మధ్యాహ్నం ఆ దృశ్యాన్ని చూడవచ్చు. మూడు నుంచి మూడున్నర నిమిషాలపాటు ఉండే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఉంటుందన్నారు. ఇందులో రెండు నిమిషాలు పూర్తిస్థాయిలో తిలకంలా కనిపించనుంది.

Tags:    

Similar News