పరిస్థితి ఆందళనకరంగా ఉంది.. సైన్యాన్ని పిలవండి : Arvind Kejriwal

Update: 2020-02-26 06:11 GMT

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.. ఈశాన్య ఢిల్లీ హింస కారణంగా చికిత్స పొందుతూ తాజాగా మరో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీంతో మరణించిన వారి సంఖ్య బుధవారం 20 కి పెరిగింది.. అలాగే 45 మంది పోలీసులు సహా 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం నుండి ప్రారంభమైన ఈ ఆందోళనలు మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.. అందులో ఆందోళనను అణచివేయడానికి ఆర్మీని పిలిచి.. ఢిల్లీ ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే కర్ఫ్యూ విధించాలని కోరారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. పోలీసులు "పరిస్థితిని నియంత్రించలేకపోతున్నారు" అని ఆయన పేర్కొన్నారు.

కాగా మౌజ్‌పూర్‌, జఫ్రాబాద్‌, భజల్ పూర్, ఛాంద్ బాగ్, కారావల్ నగర్, బాబర్ పూర్ , గోకుల్‌పురి ప్రాంతాల్లో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు.. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడమే కాకుండా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రాడ్లు మరియు కర్రలతో తిరుగుతూ, పోలీసులు చూస్తుండటంతో ఇళ్ళు మరియు దుకాణాలను తగలబెట్టారు.. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.

మరోవైపు కోర్టు ఆదేశాల కోసం వేచి చూడకుండా పరిస్థితిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. దేశ రాజధానిలో హింసను ప్రేరేపించిన వారిపై తీసుకున్న చర్యలపై స్పందన కోరుతూ జస్టిస్ ఎస్ మురళీధర్, తల్వంత్ సింగ్ ధర్మాసనం ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసు జారీ చేసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మంగళవారం బాధిత ప్రాంతాల్లో 67 కంపెనీలను, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు.

హింసాకాండకు సంబంధించి సుమారు 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. షూట్-ఎట్-విజన్ ఆర్డర్లు కూడా జారీ చేశారు. ఇదిలావుంటే ఢిల్లీలో ఆందోళనలను అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు వైఫల్యం చెందారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం విమర్శించారు.   


Tags:    

Similar News