Tamilnadu: మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చావబాదారు.. యువకుడు మృతి

Update: 2020-02-17 03:29 GMT

తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది.. మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ దళిత యువకుడిని చితకబాదారు.. దాంతో అతను మృతిచెందాడు. అతన్ని కట్టేసి కొట్టిన సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దాంతో అది వైరల్ గా మారింది. ఈ క్రమంలో జాతీయ దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో ఉండే విల్లుపురంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బైక్ మీద వెళుతున్న శక్తివేల్ అనే యువకుడు పొలంలో పనిచేసుకుంటున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.. దాంతో ఆ మహిళ తన కుటుంబసభ్యులకు చెప్పింది. ఈ క్రమంలో ఆ యువకుణ్ణి పట్టుకొని చితకబాదారు. అతన్ని కట్టివేసి నోటి నుండి రక్తస్రావం వచ్చేలా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.

ఆ తరువాత అతన్ని అక్కడే వదిలేసి వెళ్లారు. అయితే ఘటన గుర్తించి తెలుసుకున్న శక్తివేల్ కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకెళ్లడంతో తీవ్ర గాయాలతో అతను మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు మహిళలు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిమీద ఎస్సి ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అభియోగాలు మోపారు. అలాగే శక్తివేల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4 లక్షల రూపాయల పరిహారం ఇచ్చింది.

ఇక ఈ ఘటనపై శక్తివేల్ సోదరి మాట్లాడుతూ.. తన బైక్ పెట్రోల్ అయిపోయిందని అలాగే అతనికి కడుపు నొప్పి ఉందని, ఉపశమనం కోసం పొలంలోకి వెళ్ళవలసి వచ్చిందని.. దాంతో అతను దళితుడు కావడంతో అతనిపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. ఇదిలావుంటే పోలీసులు మాత్రం కుల కోణాన్ని తోసిపుచ్చారు. అతనిపై దాడి చేసినప్పుడు వారికి అతని కులం గురించి తెలియదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నాము.. అని విల్లుపురంలోని సీనియర్ పోలీసు అధికారి జయకుమార్ చెప్పారు. మరోవైపు శక్తివేల్ గతంలోనే ఓ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్నాడు, కాని ఆమె కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత అతనిపై కేసు క్లోజ్ అయింది. 

Tags:    

Similar News