Breaking : కరోనావైరస్ ప్రభావంతో మార్చి 31 వరకు అన్ని రైళ్లు రద్దు..

Update: 2020-03-22 08:26 GMT

భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 వరకు అన్ని రైల్వే కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 22 అర్ధరాత్రి నుండి మార్చి 31 అర్ధరాత్రి వరకు కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తాయని భారతీయ రైల్వే తెలిపింది. ఈ మేరకు ఈ రోజు జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. "ప్రీమియం రైలు సేవలు, మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో, కొంకణ్ రైవేలు మొదలైన వాటితో సహా భారత రైల్వేలోని అన్ని ప్యాసింజర్ రైలు సర్వీసులను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్టు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే, మార్చి 22 న తెల్లవారుజామున 4.00 గంటలకు ముందే బయలుదేరిన రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని రైల్వే తెలిపింది. "ప్రయాణ సమయంలో మరియు వారి గమ్యస్థానాలలో ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రయాణీకులకు తగిన ఏర్పాట్లు చేయబడతాయి" అని రైల్వే ప్రకటన తెలిపింది.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అవసరమైన సామాగ్రిని పంపించడానికి గూడ్స్ రైళ్లు కొనసాగుతాయని రైల్వే తెలిపింది. మార్చి 21 లోపు రైలు టిక్కెట్లను బుక్ చేసుకున్నవారికి, రద్దు చేసిన అన్ని రైళ్లకు నగదు వాపసును రైల్వే అందిస్తుందని తెలిపింది.. రైలు రద్దు వల్ల ప్రభావితమైన ప్రయాణీకులకు ఇబ్బంది లేని వాపసు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి అని రైల్వే ప్రకటన తెలిపింది.

కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు మద్దతుగా ఈరోజు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే గతంలోనే నిర్ణయించింది. అందులో భాగంగానే నిన్న రాత్రి పది గంటలనుంచి పలు రైళ్లను రద్దు చేశారు.. జనతా కర్ఫ్యూ సమయంలో రైలు ప్రయాణానికి డిమాండ్ తగ్గుతుందనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా రైళ్ల రద్దుపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  

Tags:    

Similar News