ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు: సీల్డు కవరులో స్టేటస్ రిపోర్టును సమర్పించిన సీబీఐ-ఈడీ
ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టులో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేశాయి.
ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టులో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేశాయి. ఈ నివేదికను సీల్డు కవరులో కోర్టుకు సమర్పించారు. దీనితో పాటు సిబిఐ, ఈడీ కూడా కోర్టు నుంచి కొంత సమయం కోరింది. ఈ కేసుకు సంబంధించిన లేఖలు 5 దేశాల్లో పెండింగ్‌లో ఉన్నాయని ఎఎస్‌జి సంజయ్ జైన్ కోర్టుకు తెలిపారు. నాలుగు దేశాలకు లెటర్స్ రోగేటరీ (ఎల్‌ఆర్‌లు) పంపించామని, ఈ కేసుకు సంబంధించి వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్‌కు తెలిపింది.
దర్యాప్తు సంస్థ మరొక దేశం నుండి సమాచారం కావాలనుకున్నప్పుడు అభ్యర్థనపై కోర్టులు ఎల్ఆర్ జారీ చేస్తాయి. అయితే ఈ సమాచారం ఇంకా అందలేదు.. ఈ కేసులో ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని ఎఎస్‌జి సంజయ్ జైన్ కోర్టుకు తెలిపారు. దాంతో ప్రస్తుతం, ఈ కేసులో మే 4 న విచారణకు కోర్టు తదుపరి తేదీగా నిర్ణయించింది.
కాగా ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం మరియు ఇతరులపై సిబిఐ, ఈడీ కేసు నమోదు చేశాయి. ఇద్దరూ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసును ప్రత్యేక సిబిఐ జడ్జి ఎకె కుహార్ విచారిస్తున్నారు. అంతకుముందు ఈ కేసును జడ్జి ఓపీ సైనీ విచారించారు. అయితే, ఆయన పదవీ విరమణ తరువాత ఈ విషయాన్ని న్యాయమూర్తి ఎకె కుహార్‌కు బదిలీ చేశారు.
ఈ కేసు 2006 లో ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) ఆమోదంలో జరిగిన అవకతవకలకు సంబంధించినది. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2006 లో ఈ ఆమోదం లభించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానం, నిబంధనల ప్రకారం చిదంబరానికి మాత్రమే ఈ ప్రతిపాదనలను ఆమోదించే హక్కు ఉంది. ఈ ప్రతిపాదనలలో 600 కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు పెట్టాయి.