Congress:కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో పెరుగుతున్న ఆశావహులు

Congress: గాంధీ కుటుంబం న్యూట్రల్‌గా ఉంటామని చెప్పడంతో మరికొందరు ఆసక్తి

Update: 2022-09-23 05:28 GMT

Congress:కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో పెరుగుతున్న ఆశావహులు

Congress: కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోంది. ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావహుల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఒప్పుకుంటే ఈ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. పోటీలో ఎవరూ ఉండరు. కానీ ఆయన అనాసక్తిగా ఉండడంతో.. ఇతర నేతలు కూడా తమలోని కోరికను బయటపెడుతున్నారు. అధ్యక్ష పీఠంలో కూర్చునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఆశావహుల జాబితా క్రమంగా పెరుగుతుండటంతో.. రేసులో మరిన్ని పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా కమల్‌ నాథ్‌, మనీశ్‌ తివారీ కూడా ఈ ఎన్నికలో పోటీపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు పార్టీ సీనియర్‌ నేతలు శశిథరూర్‌, అశోక్‌ గహ్లోత్‌ సిద్ధమవుతుండగా.. మరోనేత దిగ్విజయ్ సింగ్‌ పేరు కూడా వినిపించింది. మళ్లీ ఇప్పుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ పేరు వచ్చి చేరింది. ఆయన కూడా ఎన్నికలో పోటీ పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఆశావహుల జాబితా ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. మాజీ కేంద్రమంత్రులు మనీశ్‌ తివారీ, పృథ్విరాజ్ చవాన్‌, ముకుల్ వాస్నిక్, మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ బరిలో ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ అనివార్యమయ్యేలా ఉంది. మరోవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలంటూ ఇప్పటికే దాదాపుగా 8 రాష్ట్రాల PCCలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. మరిన్ని రాష్ట్రాల PCCలు కూడా ఇదే తరహా తీర్మానాలు ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Tags:    

Similar News