Lockdown: లాక్‌డౌన్‌తో వాతావరణానికి మేలు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో తగ్గిన కాలుష్యం
Lockdown: లాక్‌డౌన్ వాతావరణానికి చాలా మేలు చేసింది. ముఖ్యంగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.
Lockdown: లాక్‌డౌన్ వాతావరణానికి చాలా మేలు చేసింది. ముఖ్యంగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. మునుపెన్నడూ లేనివిధంగా నగరాలు, పట్టణాల్లో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. శ్వాసకోశ ఇబ్బందులతో సతమతం అయ్యే వారికి స్వచ్ఛమైన వాయువు దోహదపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. తెలంగాణలో కొనసాగుతోన్న లాక్ డౌన్ వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గింది. పలు నగరాలు గ్రీన్ జోన్ లోకి వచ్చాయి. కాలుష్యం తగ్గడంతో ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చుకోగలుగుతున్నారు.
కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా గత ఏడాది భారత్‌లో విధించిన తొలి లాక్‌డౌన్ ఫలితంగా వాయు నాణ్యత పెరిగినట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా తగ్గినట్లు తెలిపింది. లాక్‌డౌన్‌తో కీలకమైన వాతావరణ ప్రయోజనాలు చేకూరినట్లు ఎన్విరాన్‌మెంట్ రీసెర్చి జర్నల్ అధ్యయనంలో తేలింది. లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా భూ, వాయుమార్గాల్లో రవాణా గణనీయంగా తగ్గడం, పారిశ్రామిక కార్యకలాపాలు ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల వాతావరణం బాగా మెరుగైనట్లు అధ్యయనం వెల్లడించింది.
ప్రధానంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలపై పరిశోధకులు దృష్టి సారించారు. గత ఏడాది మార్చి నుంచి మే మధ్య లాక్‌డౌన్ సమయంలో పరిస్థితులను విశ్లేషించారు. దేశవ్యాప్తంగా నైట్రోజన్ డైఆక్సైడ్ 12 శాతం తగ్గగా పై 6 నగరల్లో అది 31.5% మేర తగ్గింది. 2015-2019 మధ్య ఐదేళ్ల సగటుతో పోలిస్తే గత ఏడాది విధించిన లాక్‌డౌన్‌తో దేశ ప్రధాన నగరాల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. పగటి వేళ 1 డిగ్రీ, రాత్రి 2 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గడం విశేషం.