Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 86 విమానాలు రద్దు

Air India Express: అనారోగ్యం కారణంతో మూకుమ్మడి సెలవు పెట్టిన క్యాబిన్ సిబ్బంది

Update: 2024-05-08 07:04 GMT

Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 86 విమానాలు రద్దు

Air India Express: ఎయిరిండియా విమానయాన సంస్థకు ఉద్యోగులు షాకిచ్చారు. క్యాబిన్ క్రూ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టారు. 300 మందికిపైగా సీనియర్ సిబ్బంది చివరి క్షణంలో సిక్ అయ్యామంటూ లీవ్ పెట్టడంతో పలు దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోయాయి. వేరే ప్రత్యామ్నాయం లేక 80కి పైగా సర్వీసులను ఆ సంస్థ రద్దు చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వివిధ నగరాలు, విదేశాలకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానలను రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విమానాశ్రయాల్లో తాము వెళ్లాల్సిన విమానాల కోసం ఎదురుచూసి నానా అవస్థలు పడ్డారు. సిబ్బంది చివరి నిమిషంలో సెలవు పెట్టడంతో విమానాలను నడపడం వీలుపడలేదని, అసౌకర్యానికి క్షమించాలని ప్రయాణికులను ఎయిరిండియా ఓ ప్రకటనలో కోరింది.

ఇక తమ ఉద్యోగుల సామూహిక సెలవుల వెనకున్న కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది ఆ సంస్థ. సిబ్బంది మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, డబ్బులు పూర్తిగా తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణాన్ని రద్దు చేసుకునేందుకు అంగీకరించినవారికి మరో తేదీకి టికెట్ జారీచేస్తున్నట్టు కొందరు ప్రయాణికులు తెలిపారు.

నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టగా.. దానిని టాటా సంస్థ రూ.18 వేల కోట్లకు దక్కించుకుంది. కానీ, ప్రయివేటీకరణను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించినా.. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రయివేటుపరం కావడంతో ఉద్యోగుల విషయంలో సంస్థ తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్లు ఒకేసారి సిక్ లీవ్ పెట్టడంతో విమానాలు నిలిచిపోయాయి. చివరి క్షణంలో వారు తీసుకున్న నిర్ణయం సర్వీసులను ప్రభావితం చేసింది.

Tags:    

Similar News