ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు కార్మికుల దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు శనివారం ఉదయం ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన..

Update: 2020-09-05 04:12 GMT

ఛత్తీస్ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి గుజరాత్‌కు వెళ్తున్న బస్సు శనివారం ఉదయం రాయ్‌పూర్‌లో ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలీలను ఒడిశాలోని గంజాం నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తీసుకెళ్తున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం వారి వాహనం బయలుదేరింది. ఈ క్రమంలో రాయ్‌పూర్‌లోని చెరి ఖేడి గుండా వెళుతుండగా తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు.. కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దాంతో అక్కడికక్కడే ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై రాయపూర్ ఎస్ఎస్పీ అజయ్ యాదవ్ మాట్లాడుతూ.. ఒడిశాలోని గంజాం నుంచి గుజరాత్‌లోని సూరత్ వెళుతున్న

బస్సు రాయపూర్‌లో ప్రమాదానికి గురైందని.. ఏడుగురు మరణించారని చెప్పారు, అలాగే మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఇక గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆయన అన్నారు, మృతులను ఇంకా గుర్తించాల్సివుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలంలో దర్యాప్తు జరుపుతున్నారు. కాగా డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో ఉన్న ట్రక్, బస్సు ను క్రేన్ సహాయంతో పక్కకు తీశారు.. బలంగా ఢీకొనడంతో వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఘోర ప్రమాదం జరగడంతో చుట్టుపక్కలవారు సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు.    

Tags:    

Similar News