Lok Sabha Election 2024: ఈ ఫలితాలలో 10 ముఖ్యాంశాలివే...!

ఈ ఎన్నికలు బీజేపీకి ఒక విధంగా గుణపాఠమే నేర్పాయి. ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతున్న సంకేతాలను స్పష్టంగా ఇచ్చాయి.

Update: 2024-06-04 16:30 GMT

Lok Sabha Election 2024: ఈ ఫలితాలలో 10 ముఖ్యాంశాలివే...!

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మోదీని మరోసారి ప్రధాని పదవిని కట్టబెట్టాయి. కానీ, నిజంగానే మోదీ అండ్ పార్టీకి ఈ ఎన్నికలు విజయోత్సాహాన్ని ఇచ్చాయా? ఈసారి 400 స్థానాలకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని స్వయంగా మోదీయే ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ, ఆ పార్టీకి ఉత్తరాది రాష్ట్రాలే నిరాశను మిగిల్చాయని చెప్పక తప్పదు. ఈ ఎన్నికలు బీజేపీకి ఒక విధంగా గుణపాఠమే నేర్పాయి. ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతున్న సంకేతాలను స్పష్టంగా ఇచ్చాయి. ఇవీ 2024 లోక్ సభ ఎన్నికల గురించి అందరూ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు.

1. తాజా ఫలితాల ప్రకారం 217 సీట్లలో విజయం సాధించిన బీజేపీ మరో 23 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అంటే, 2019 ఎన్నికలతో పోల్చితే బీజేపీ ఈసారి గణనీయంగా 63 సీట్లు కోల్పోయింది.

2. ఎన్‌డీఏ కూటమి మొత్తం స్థానాలు 300 లోపే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ కూటమికైనా 543 స్థానాల పార్లమెంటులో కనీసం 272 స్థానాలు ఉండాలి. అంటే, బీజేపీకి ఈసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని ప్రజలు ఇవ్వలేదు. మిత్ర పక్షాలతో కలుపుకున్నా మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 20 స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే, ఎన్‌డీఏ కూటమిలో నితీశ్, చంద్రబాబు వంటి నేతల సపోర్టు లేకపోతే బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.

3. బీజేపీ 2019లో సొంతంగా 303 పార్లమెంటు స్థానాలు గెల్చుకుంది. ఈసారి 60కి పైగా సీట్లను కోల్పోయింది. ఈ పార్టీ ఓట్ల శాతం కూడా 37.3 నుంచి 36.9 శాతానికి పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 19. 4 శాతం నుంచి 21.8 శాతానికి తన ఓట్లను పెంచుకోగలిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం ఈ ఫలితాలలో స్పష్టంగానే కనిపించింది.

4. ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమైన విషయం, ప్రాంతీయ పార్టీల బలం పెరగడం. బిహార్‌లో నితిశ్ కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ) 15 స్థానాలు గెల్చుకోబోతోంది. రామ్ విలాస్ లోక్ జనశక్తి పార్టీ 5 సీట్లలో గెలుస్తోంది. గతంలో ఈ రాష్ట్రంలో 17 సీట్లు గెల్చుకున్న బీజేపీకి ఈసారి నాలుగు సీట్లు తగ్గాయి. మరీ ముఖ్యంగా, మహారాష్ట్రలో బీజేపీ అక్కడ మొత్తం 48 స్థానాలలో 23 గెల్చుకుంది. ఈసారి అక్కడ బీజేపీకి 11 సీట్లే వస్తున్నాయి. శివసేన (యుబిటి)11 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ మరో 12 స్థ్థానాలను సొంతం చేసుకుంది.

5. యూపీ ప్రజలు బీజేపీకి ఈసారి పెద్ద షాక్ ఇచ్చారు. 80 సీట్లలో ఇక్కడ బీజేపీ 32 సీట్లే గెల్చుకుంది. 2019తో పోల్చితే దాదాపు సగం సీట్లు కోల్పోయింది. గతంలో 5 సీట్లు గెల్చుకున్న సమాజ్ వాదీ పార్టీ ఈసారి 37 సీట్లలో జెండా ఎగరేసింది.

6. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 30కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ తనకున్న 18 సీట్లలో 8 సీట్లు పోగొట్టుకుంది.

7. దేశవ్యాప్తంగా ముస్లింల ఓట్లు అధికంగా ఉన్న 103 స్థానాల్లో బీజేపీ 2019లో 45 సీట్లు గెల్చుకుంది. ఇప్పుడు ఆ సంఖ్య 35కు పడిపోయింది. ఆ పార్టీ పట్ల ముస్లింల నమ్మకం తగ్గుతోందనడానికి ఇదొక సంకేతం.

8. కాంగ్రెస్-ముక్త్ భారత్... అంటే కాంగ్రెస్ లేని భారతదేశం కావాలని డిమాండ్ చేసిన బీజేపీ కలను ఈ ఎన్నికలు పటాపంచలు చేశాయి. 2019లో 52 స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గణనీయంగా 95 స్థానాల్లో విజయం సాధించింది. ఇండియా కూటమి తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్రలలో చెప్పుకోతగిన విజయాలు సాధించింది. ఈ మూడు రాష్ట్రాలతో పాటు హర్యానాను కలుపుకుంటే ఆ పార్టీ 32 సీట్లు గెల్చుకుంది.

9. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట వల్ల బీజేపీకి పెద్దగా అనుకూల పవనాలేమీ ఈ ఎన్నికల్లో వీచలేదు. అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన అవధేశ్ ప్రసాద్ బీజేపీ అభ్యర్థిపై ఆధిక్యంలో ఉన్నారంటే అయోధ్య ప్రభావం ఈ ఎన్నికల్లో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

10. ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలతో విజయం ఖాయం కాదని కూడా ఈ ఎన్నికలు నిరూపించాయి. తెలంగాణలో దళితులకు 10 లక్షల నగదు వంటి భారీ ఉచిత సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మూడోసారి అధికారంలోకి రాలేకపోయింది. అంతేకాదు, ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అనేక ఉచిత పథకాలను అమలు చేసి లబ్ధిదారుల ఓట్ల మీద ఆశలు పెట్టుకున్న వైఎస్ జగన్ పార్టీ కూడా రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో నాలుగింట మాత్రమే గెలిచింది. 175 సీట్ల అసెంబ్లీలో 10 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమైంది.

Tags:    

Similar News