నవ్వించి చంపిన 'వేణు'వు.. మూగబోయి హృదయాల్ని కదిలిస్తోంది!

నవ్వులతో ప్రేక్షకుల్ని చచ్చేంత నవ్వించిన వేణుమాధవ్ మరణించారన్న వార్త అందర్నీ కుదిపేసింది. ఒక మామూలు వ్యక్తి.. కళాకారుడిగా ఒదిగి..నటుడిగా ఎదిగి.. అభిమాన జన వర్షంలో తడుస్తూ తన అంతిమ యాత్రను పూర్తి చేసుకున్నారు.

Update: 2019-09-26 06:23 GMT

నవ్వులతో ప్రేక్షకుల్ని చచ్చేంత నవ్వించిన వేణుమాధవ్ మరణించారన్న వార్త అందర్నీ కుదిపేసింది. ఒక మామూలు వ్యక్తి.. కళాకారుడిగా ఒదిగి..నటుడిగా ఎదిగి.. అభిమాన జన వర్షంలో తడుస్తూ తన అంతిమ యాత్రను పూర్తి చేసుకున్నారు. చాలామంది వెండితెర పై వెలుగులు వెదజల్లిన వారున్నారు. కానీ, వేణుమాధవ్ తీరు వారందరికీ భిన్నమైనది. ఆయన జీవితం ఎన్నో పాఠాలకు నెలవు. ఒక అల్లరిచిల్లర పిల్లవాడు.. ఏకలవ్య శిష్యుడిగా మారిన వైనం.. పొట్టకూటి కోసం ఒక పార్టీ కార్యాలయంలో చిరు ఉద్యోగంతో కాలక్షేపం చేస్తూ అదే పార్టీ తరపున ప్రచారాన్ని నిర్వహించే స్థాయికి ఎదగడం.. సినిమాలు నాకు తెలీవని తప్పించుకు తిరిగిన కళాకారుడు.. లక్ష రూపాయలు సంపాదిస్తే చాలని శపథం పట్టిన అమాయకుడు.. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరచిపోని మహా మనిషి.. తనని చంపేసిన మీడియాకు కూడా నవ్వుతూనే కొన్నాళ్ళు బ్రతకనీయమని నవ్వుతూ చెప్పుకున్న ధీశాలి ఇలా ఎన్నో కోణాలను వేణుమాధవ్ లో చూడవచ్చు.

ఒక మనిషి విజయం సాధించాలంటే.. తనకు ఏమి వచ్చో.. ఎంత వచ్చో.. దానితో తాను ఎంత ఎదగగలడో గుర్తించగలిగితే చాలు పూలబాట పరుస్తూ విజయలక్ష్మి నడుస్తూ వస్తుంది. అదే జరిగింది వేణుమాధవ్ జీవితంలో చదువుపై దృష్టి పెట్టలేకపోయినా.. అల్లరిగా తిరుగుతున్నావని అమ్మానాన్న కోప్పడినా.. తనకు వచ్చిన చిన్న అనుకరణ అనే విద్యను గుర్తించి.. దానిలో ఎదో ఉందని గ్రహించి.. దానికి నేరెళ్ల వేణుమాధవ్ వంటి గురువును వెతుక్కుని.. ఆయనకు ఏకలవ్య శిష్యరికం చేసి.. వెంట్రిలాక్విజం వంటి కళలో తాను బాగా రాణించగలనని నమ్మి ఆ దారిలో ముళ్ళు గుచ్చినా ముందుకు సాగిన అతని ఓర్పు ఆ కళలో అందలాన్ని ఎక్కించింది.

సినిమా అంటే తెలీని అమాయకత్వంతో తనంత తానుగా వచ్చిన అవకాశం నుంచి పారిపోయినా.. తనకోసం వెదుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని వదల కూడదనీ, పైగా తన జీవితాశయం లక్ష రూపాయలు సంపాదించ వచ్చనే ఆశతో వెండి తెరవైపు వేసిన అడుగులు వెండితెర వేణువులుగా నిలిచిపోయాయి. ఆ లక్ష రూపాయల వెనుక పెద్ద కథే ఉంది. పదో తరగతి వరకూ చదువు ఇష్టం లేక తిరిగినా.. చదువు కోకపోతే జీవితం పాడైపోతుందన్న నాన్న మాటకు కట్టుబడి ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి చెన్నై లో సీఏ చదవాలని ప్రయత్నించారు వేణు. అయితే, ఆ చదువుకు ఫీజే లక్ష రూపాయలు అడిగారు. దాంతో తనకు అంత స్తోమత లేదని వదిలి వచ్చేశారాయాన. కానీ, మనసులో మాత్రం లక్ష అన్న మాట ముద్ర పడిపోయింది. అందుకే లక్ష సంపాదిస్తే చాలానే లక్ష్యం పెట్టుకున్నానని పలు సందర్భాల్లో అయన చెప్పారు.

గుల గుల జాము అంటూ తెలుగు తెరని పలకరించి.. తన లుక్.. తన మాట.. తన నడక.. ఇలా ఏదైనా సరే కామెడీకి కేరాఫ్ ఎడ్రస్ గా మార్చేసుకున్నారు వేణుమాధవ్. దాంతో తెలుగు సినీ ప్రేక్షకులు ఆయనకు బ్రహ్మరధం పట్టారు. వేణుమాధవ్ నటించిన సినిమా సీన్లు సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఉంటాయి. తెలంగాణా శకుంతలను చాలెంజి చేస్తూ లక్ష్మీ సినిమాలో ఆయన పండించిన హాస్యం.. అడుక్కుంటూ సెలైన్ బాటిల్లో మద్యం నింపుకుని తాగుతూ మాస్ సినిమాలో కడుపుబ్బ నవ్వించిన వైనం.. శ్రేయ ని ప్రేమిస్తున్నానని ప్రభాస్ తో చెప్పి బెదిరించిన ధీరత్వమైన కామెడీ.. మెగాస్టార్ చిరంజీవి తో కలిసి జై చిరంజీవ లో చేసిన అల్లరి.. ఇలా చెప్పుకుంటూ పొతే వేణుమాధవ్ నటనకు జేజేలు కొట్టించిన పాత్రలెన్నో. ఎన్ని పాత్రలు చేసినా వెకిలి హాస్యానికి దూరంగా ఉన్న ఘనత ఆయనకే చెల్లింది.

అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో వేణుమాధవ్ మరణించాడంటూ సోషల్ మీడియా హోరేత్తించింది. నేను బ్రతికే ఉన్నాను బాబోయ్ అని అందరికీ కనిపించి చెప్పుకునే వరకూ మీడియాలో ఆ వార్తలు శాంతించలేదు. అయినా సరే, అప్పుడుకూడా నవ్వుతూనే అందర్నీ తనను చంపోద్దని వేడుకున్నారు వేణు మాధవ్. కానీ, ఆ వార్తలే ఆయనను కష్టాల పాలు చేశాయని చెప్పుకుంటారు. ఆయనకు వేషాలు తగ్గిపోవడానికి అవి కూడా కారణమయ్యాయని చెబుతారు. ఇక నిర్మాతగా చేతులు కాల్చుకోవడమూ ఆయనకు ఇబ్బంది తెచ్చింది. తెలిసీ తెలియకుండా అమాయకంగా మాట్లాడే అయన మాటల్ని పొగరుబోతు తనంగా భావించిన వారూ ఉన్నారు. కానీ, కొద్దిపాటి పరిచయం ఆయనతో అయిన తరువాత చివరి వరకూ ఆయనతోనే ఉన్న స్నేహితులు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.

తీరని కోరిక ఆయనకు ఒక్కటే. ఎమ్మెల్యేగా ఒక్కసారి గెలవాలి. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్టీఅర్ ప్రోత్సాహంతో చేరిన వేణు మాధవ్ రాజకీయంగా చివరి వరకూ ఆ పార్టీతోనే ఉన్నారు. ఆ పార్టీ తరఫునే ప్రచారం చేశారు. అయితే, ఆయనకు ఎమ్మెల్యేగా గెలవాలన్న కోరిక ఉండేది. మొన్న ఎన్నికల్లో కోదాడ నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగాలని ప్రయత్నించారు. కానీ, చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. దీంతో ఆయన కోరిక తీరకుండా మిగిలిపోయింది.

తన ఇంటికి సహాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా సహకరించే వారట వేణు మాధవ్. అయితే, ధన సహాయం కన్నా బియ్యం, పప్పులు వంటివి ఇచ్చి పంపించేవారట. డబ్బు ఇస్తే తాగి పాడు చేస్తారని అయన భావించే వారని అయన సహనటుడు, స్నేహితుడు ఉత్తేజ్ చెప్పారు.

ఒక మనిషి విజయం ఎంత బావుంటుందో.. పరాజయం అంత చిరాగ్గా ఉంటుంది. సమాజంలో విజయం ఉన్నపుడు దక్కే విలువ.. పరాజయం దగ్గర కొచ్చేటప్పటికి అర్థం మార్చుకుని ముసుగేసుకుంటుంది. కానీ, వేణు మాధవ్ ఆ సత్యాన్ని తెలుసుకునే మసలు కొన్నారు. విజయం తలపై పెట్టుకు మోయలేదు. అపజయాన్ని ముసుగేసి దాచేయలేదు. రెండిటినీ సమానంగానే స్వీకరించారు. ఆటుపోట్లను ఎదుర్కున్నా చిరునవ్వు వదల లేదు. నవ్వించే తత్వాన్ని వీడలేదు. అనారోగ్యం ఆయనను కబళించినా అయన పంచిన నవ్వులతో తెలుగు సినిమా ఉన్నంత వరకూ వేణుమాధవ్ కోసం ఓ పేజీ చిరస్మరనీయంగా ఉంటుంది. చిద్విలాసల్ని చిందిస్తూ.. తనను చదివిన వారి హృదయాల్లో స్ఫూర్తిని రగిలిస్తూ!


Tags:    

Similar News