Indian 2: కమల్ హాసన్ కోసం విలన్ గా మారనున్న టాలీవుడ్ కమెడియన్
* స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న వెన్నెల కిషోర్
కమల్ హాసన్ కోసం విలన్ గా మారనున్న టాలీవుడ్ కమెడియన్
Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ ఈ మధ్యనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హీరోగా నటించిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కి విక్రమ్ సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ లభించింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఈ నేపథ్యంలోనే కమలహాసన్ తదుపరి సినిమాల విషయంలో కూడా అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నారు.
1996లో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా విడుదలై సూపర్ హిట్ అయిన "భారతీయుడు" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ ఒకరు ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ కమెడియన్ మరెవరో కాదు వెన్నెల కిషోర్. తెలుగులో ప్రముఖ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వెన్నెల కిషోర్ తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులలో నవ్వుల పువ్వులు పూయిస్తూ ఉంటారు. అలాంటిది వెన్నెల కిషోర్ విలన్ పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వెన్నెల కిషోర్ పాత్ర గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో రకుల్ ప్రీత్, ప్రియ భవాని శంకర్, బాబి సింహ, సముద్రఖని, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.