Thalapathy Vijay : దళపతి విజయ్‌పై కోలీవుడ్ కుట్ర.. చివరి సినిమాను దెబ్బకొట్టేందుకు ఒక్కటైన రాజకీయ శక్తులు
తమిళనాడు రాజకీయాలకు, వెండితెరకు విడదీయలేని బంధం ఉంది. అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి నుంచి జయలలిత, విజయ్‌కాంత్ వరకు అందరూ సినిమా గ్లామర్‌తోనే రాజకీయాల్లో చక్రం తిప్పారు.
Thalapathy Vijay : దళపతి విజయ్‌పై కోలీవుడ్ కుట్ర.. చివరి సినిమాను దెబ్బకొట్టేందుకు ఒక్కటైన రాజకీయ శక్తులు
Thalapathy Vijay : తమిళనాడు రాజకీయాలకు, వెండితెరకు విడదీయలేని బంధం ఉంది. అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి నుంచి జయలలిత, విజయ్‌కాంత్ వరకు అందరూ సినిమా గ్లామర్‌తోనే రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు అదే బాటలో దళపతి విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగం(TVK) స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాదిగా భావిస్తున్న ఆయన చివరి సినిమా జన నాయగన్ ఇప్పుడు పెద్ద రాజకీయ చదరంగంలో చిక్కుకుంది. ప్రత్యర్థులు విజయ్ సినిమాను టార్గెట్ చేస్తూ పక్కా స్కెచ్ వేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
విజయ్ తన కెరీర్‌లో 69వ సినిమాగా వస్తున్న జన నాయగన్ ను జనవరి 9, 2026న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తిగా ఒక పొలిటికల్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. ప్రజా నాయకుడు అనే అర్థం వచ్చేలా ఈ టైటిల్ పెట్టడమే కాకుండా, తన పొలిటికల్ ఎంట్రీకి దీన్ని ఒక పెద్ద ప్రచార అస్త్రంగా విజయ్ భావిస్తున్నారు. అయితే విజయ్ దూకుడుకు బ్రేకులు వేయాలని చూస్తున్న ప్రత్యర్థులు, అదే సమయంలో మరో భారీ సినిమాను పోటీకి దింపుతున్నారు.
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన పరాశక్తి సినిమా నిజానికి జనవరి 14న విడుదల కావాల్సి ఉంది. కానీ, విజయ్ సినిమాకు పోటీగా దీన్ని ఒక రోజు ఆలస్యంగా అంటే జనవరి 10నే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమా నిర్మాత ఆకాష్ భాస్కరన్ అధికార డీఎంకే (DMK) పార్టీకి చెందిన కీలక నేతలకు బంధువు కావడంతో, ఇది పూర్తిగా విజయ్ సినిమాను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నమని టాక్ వినిపిస్తోంది. 1952లో వచ్చిన పరాశక్తి సినిమా ఎలాగైతే తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందో, ఇప్పుడు వస్తున్న ఈ కొత్త పరాశక్తి కూడా హిందీ వ్యతిరేకత, కుల వివక్ష వంటి రాజకీయ అంశాలతో విజయ్ సినిమాకు కౌంటర్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం.
కేవలం శివకార్తికేయన్ సినిమానే కాకుండా, అదే సమయంలో అజిత్ పాత సూపర్ హిట్ సినిమాలను కూడా రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల విజయ్ సినిమాకు ఎక్కువ థియేటర్లు దొరకకుండా చేయడం, ఆడియన్స్ అటెన్షన్ డైవర్ట్ చేయడం ప్రత్యర్థుల అసలు ప్లాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు విజయ్ అభిమానులు తమ నాయకుడికి ఘనంగా వీడ్కోలు పలకాలని చూస్తుంటే, మరోవైపు సినిమా సాక్షిగా పొలిటికల్ వార్ మొదలైంది. మరి ఈ థియేటర్ల యుద్ధంలో గెలిచి విజయ్ నిజమైన జన నాయగన్ అనిపించుకుంటారో లేదో చూడాలి.