Rukmini Vasanth: విలన్‌గా చేసినా జనం నన్ను వదులుకోలేదు..ఎమోషనల్ అయిన కాంతార హీరోయిన్
Rukmini Vasanth: హీరోయిన్ రుక్మిణి వసంత్ ప్రస్తుతం వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు.
Rukmini Vasanth: హీరోయిన్ రుక్మిణి వసంత్ ప్రస్తుతం వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఆమె ఇటీవల నటించిన కాంతార: చాప్టర్ 1 సినిమాలో పోషించిన పాత్ర గురించి తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి నెగెటివ్ పాత్ర (విలన్ షేడ్స్ ఉన్న పాత్ర) పోషించారు. సాధారణంగా సినీ కెరీర్ ప్రారంభంలోనే హీరోయిన్లు ఇలాంటి ప్రయోగాత్మక విలన్ పాత్రలు చేయడం రిస్క్ అని భావిస్తారు. ఎందుకంటే అభిమానులు అంగీకరించకపోవచ్చు లేదా ద్వేషించవచ్చు. కానీ రుక్మిణి విషయంలో అలా జరగలేదు.
బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "నేను కాంతార: చాప్టర్ 1 చిత్రంలో విలన్ పాత్ర చేశాను. నా పాత్ర విలన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే, నేను నెగెటివ్ పాత్ర చేసినప్పటికీ ప్రజలు నన్ను అంగీకరించారు ప్రేమించారు. వారు నన్ను ద్వేషించలేదు. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది" అని తన ఆనందాన్ని పంచుకున్నారు.
రుక్మిణి వసంత్ కెరీర్‌లో ఆమె పోషించిన పాత్రలను గమనిస్తే ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. గతంలో ఆమె నటించిన అనేక సినిమాల్లో ఆమె పాత్ర చివరికి కథానాయకుడికి దక్కదు. కాంతార: చాప్టర్ 1లో కూడా అదే జరిగింది. చిత్రంలో ఆమె ఒక నెగెటివ్ పాత్రను పోషించడమే కాకుండా, చివరికి కథానాయకుడి చేతిలోనే మరణిస్తుంది. ఈ విధంగా తన పాత్రలకు ఉండే వైవిధ్యం, ప్రయోగాలకు ప్రేక్షకులు మద్దతు ఇవ్వడం పట్ల ఆమె సంతోషంగా ఉన్నారు. నటిగా తాను కేవలం క్యూట్ పాత్రలకే పరిమితం కాకుండా, విభిన్న ఛాయలున్న పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె పరోక్షంగా తెలియజేస్తున్నారు.