February Movies 2025: ఫిబ్రవరిలో వరుసగా సినిమాల పండగ
సంక్రాంతి చిత్రాల సందడితో ఈ ఏడాది కొత్త ఆరంభం అదిరింది. ఇక అదే జోరును కొనసాగిస్తూ ఈ సారి ఫిబ్రవరిలోనూ సినీ ప్రియులకు వినోదాల విందును అందించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి.
ఫిబ్రవరిలో వరుసగా సినిమాల పండగ
February release Movies 2025: సంక్రాంతి చిత్రాల సందడితో ఈ ఏడాది కొత్త ఆరంభం అదిరింది. ఇక అదే జోరును కొనసాగిస్తూ ఈ సారి ఫిబ్రవరిలోనూ సినీ ప్రియులకు వినోదాల విందును అందించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫిబ్రవరిలో మొదట థియేటర్లలోకి అడుగుపెట్టేది అజిత్ అనువాద చిత్రం పట్టుదల. మగిళ్ తిరుమేని రూపొందించిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆసక్తిని పెంచేలా ఉండడంతో తెలుగులోనూ దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం తండేల్. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో దేశభక్తిని కూడా యాడ్ చేశారు. ఈ చిత్రంలో నాగచైతన్య ఉత్తరాంధ్ర యాస, బుజ్జితల్లి పాత్రలో సాయిపల్లవి, చైతూతో ఆమె కెమిస్ట్రీ సినిమాకు ఆకర్షణగా నిలవనున్నట్టు తెలుస్తోంది. మరి ఇది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 7 వరకు వేచి చూడక తప్పదు.
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అవే విశ్వక్ సేన్ - లైలా, కిరణ్ అబ్బవరం - దిల్ రూబా, రాజా గౌతమ్, బ్రహ్మానందం కలిసి నటించిన బ్రహ్మా ఆనందం. ఈ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. లైలా సినిమాకు రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో విశ్వక్ అమ్మాయిగా కనిపించనున్నాడు.
బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజాగౌతమ్ కలిసిన నటిస్తున్న సినిమా బ్రహ్మా ఆనందం. ఈ సినిమాకు ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వీరిద్దరూ తాత మనవడిగా కనువిందు చేయనున్నారు. ఇక దిల్ రూబా సినిమాకు విశ్వకరణ్ దర్శకత్వం వహించారు. క మూవీ విజయం తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న సినిమా కావడంతో సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
మజాకాతో సినీ ప్రియుల్ని నవ్వించేందుకు సందీప్ కిషన్ సిద్ధమవుతున్నారు. ధమాకా విజయం తర్వాత త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలకానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.
తమిళ కథానాయకుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా. పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ధనుష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అటు తమిళం, ఇటు తెలుగులోనూ దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన భైరవం సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఫిబ్రవరి ఆఖరి వారంలో ఆది పినిశెట్టి శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను అరివళగన్ వెంకటాచలం తెరకెక్కించారు. ఇది తెలుగు, తమిళం భాషల్లో ఫిబ్రవరి 28న విడుదలకానుంది.
లవ్ టుడే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ప్రదీప్ రంగనాథ్. ప్రదీప్ రంగనాథ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. రొమాంటిక్, కామెడీ నేపథ్యంలో అశ్వత్ మారిముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.