హీరామండి: కళలకు కేంద్రమైన ఈ ప్రాంతం ‘రెడ్ లైట్ ఏరియా’గా ఎలా మారింది?

Heeramandi: చారిత్రక కథలను ఎంచుకొని కట్టిపడేసే కథనం, కళ్లు తిప్పుకోనివ్వని సెట్లతో కనికట్టు చేయడంలో సంజయ్ లీలా భన్సాలీ పెట్టింది పేరు.

Update: 2024-05-04 10:44 GMT

హీరామండి: కళలకు కేంద్రమైన ఈ ప్రాంతం ‘రెడ్ లైట్ ఏరియా’గా ఎలా మారింది?

Heeramandi: చారిత్రక కథలను ఎంచుకొని కట్టిపడేసే కథనం, కళ్లు తిప్పుకోనివ్వని సెట్లతో కనికట్టు చేయడంలో సంజయ్ లీలా భన్సాలీ పెట్టింది పేరు. తాజాగా ఆయన ‘హీరామండి - ద డైమండ్ బజార్’ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సిరీస్ కథతో దాదాపు 14 ఏళ్ల క్రితమే రచయిత మొయిన్ బేగ్.. సంజయ్ దగ్గరకు వచ్చారు. అప్పటి నుంచీ వారి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి 2021లో దీన్ని పట్టాలెక్కించారు.

మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీ రావ్ హైదరీ, రిచా చడ్ఢా, సంజీదా షేక్, షర్మీన్ సెహగల్ లాంటి పేరున్న నటులు ఈ సిరీస్‌లో నటించడంతో ఈ సిరీస్‌పై ప్రేక్షకు్లో అంచనాలు కూడా పెరిగాయి.

సెక్స్ వర్కర్ల జీవితాలు, ప్రేమ, మోసం, నృత్యం తదితర అంశాల చుట్టు హీరామండి కథ తిరుగుతుంది. అయితే, వీటి వెనుక ఎంచుకున్న నేపథ్యానికి వాస్తవ ఘటనలే స్ఫూర్తి అని సంజయ్ ఇదివరకే స్పష్టంచేశారు.


అసలేమిటీ హీరామండీ?

హీరామండీ పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉంది. ‘హీరా సింగ్ డోగ్రా’ పేరనే ఆ ప్రాంతానికి పెట్టారు. మహారాజా రంజిత్ సింగ్‌కు నమ్మినబంటు, జనరల్ ధియాన్ సింగ్ డోగ్రా కుమారుడే హీరా సింగ్. ఈయన 1843 సెప్టెంబరు 17 నుంచి నుంచి 1844 డిసెంబరు 21 వరకూ లాహోర్‌లోని సిక్కు రాజ్యానికి ప్రధాన మంత్రిగా పనిచేశారు.

స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడమే లక్ష్యంగా రాజ దర్బారుకు సమీపంలోని షాహీ మొహల్లాలో ఒక మార్కెట్‌ను ఏర్పాటుచేయాలని హీరా సింగ్ భావించారు. మొదట ఈ మార్కెట్‌కు ‘హీరా సింగ్ డీ మండి’ అని పేరు పెట్టారు.

ఈ మండీతో షాహి మొహల్లా పేరు ప్రఖ్యాతులు పెరిగాయి. అలానే ఆ పక్కనే ఉండే హీరామండి నృత్యకళాకారిణిలు వసతి గృహాలు గురించి అందరికీ తెలియడం ఎక్కువైంది.


ఎవరి నృత్యకళాకారిణులు?

సిరీస్‌లో చూపించినట్లు ఈ నృత్య కళాకారిణిలంతా వయసులో ఉండే అమ్మాయిలే. వారికి సంగీతం, నృత్యం, కవితలు, భాష, సాహిత్యం తదితర అంశాల్లో రాజ దర్బారు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. వీరంతా విద్యా వంతులు. పైగా నెలనెలా వీరికి జీతం కూడా ఇచ్చేవారు.

సాధారణంగా ఇక్కడుంటే అమ్మాయిల్లో చాలా మంది నృత్యకళాకారిణుల కుటుంబాల్లో పుట్టినవారే. సమాజంలో బలహీన వర్గాలకు చెందిన రాజులు, భూస్వాములు వీరిని ప్రోత్సహించేవారు. కొన్నిసార్లు అఫ్గానిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి ప్రాంతాల నుంచి అమ్మాయిలను కథక్ లాంటి నృత్యాల ప్రదర్శనకు తీసుకొచ్చేవారు.

వేడుకలు, కార్యక్రమాల్లో ఈ నృత్య కళాకారిణులు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చేవారు. వీకి సమాజంలో గౌరవం దక్కేది.

‘‘సమాజంలో ఎలా జీవించాలి? ఇతరులతో ఎలా నడుచుకోవాలి? లాంటి అంశాలను నేర్చుకునేందుకు పిల్లల నుంచి పెద్దల వరకూ చాలా మంది ఈ నృత్య కళాకారిణులు ఉండే కోటలకు వచ్చేవారు’’ అని స్టేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ త్రిపురారి శర్మ బీబీసీతో చెప్పారు.


వేశ్యలుగా ఎలా మారారు?

అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రలతోపాటు బ్రిటిష్ పాలతో హీరామండీలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కళాకారిణులకు బహుమానంగా ఇచ్చే భూములతోపాటు గౌరవ బిరుదులను కూడా రద్దు చేశారు. అంతేకాదు బ్రిటిష్ చర్యలతో కళాకారిణులను ప్రోత్సహించే భూస్వాములు, ఇతర రాజ కుటుంబ సభ్యుల సంఖ్యా తగ్గిపోయింది.

‘‘బ్రిటిష్ పాలకులు హీరామండీని ‘బజారే-ఇ-హుస్న్ (మార్కెట్ ఆఫ్ బ్యూటీ)గా పిలిచేవారు. అలా నెమ్మదిగా కళలకు నెలవైన ఈ కేంద్రాలు వేశ్యావాటికల్లా మారిపోయాయి. నెమ్మదిగా దీన్ని రెడ్ లైట్ డిస్ట్రిక్ట్‌గానూ పిలవడం మొదలుపెట్టారు’’ అని ప్రముఖ రచయిత సంజన రే జీక్యూ ఫీచర్ మ్యాగజైన్‌‌కు రాసిన ఓ కథనంలో చెప్పారు.

అలా క్రమంగా ఇక్కడి కళాకారిణుల దగ్గరకు వచ్చే రాజ కుటుంబ సభ్యుల తగ్గిపోయింది. అదే సమయంలో ధనికుల కుటుంబాలు, బ్రిటిష్ సైనికుల సంఖ్య పెరిగింది. అలా నెమ్మదిగా కళాకారుల నుంచి సెక్స్ వర్కర్ల స్థాయికి వీరు పడిపోయారు.

ఈ సెక్స్‌ వర్కర్లలో కొందరు భారత్, పాకిస్తాన్ సినిమాల్లో నటించారు, నృత్య కళాకారిణులు గానూ మెప్పించారు.

నేడు హీరామండిలో మ్యూజిక్, డ్యాన్స్ స్టూడియోలు కనిపిస్తాయి. ఫుడ్‌స్ట్రీట్‌లు, రెస్టారెంట్లు, షాపుల సంఖ్య కూడా ఇక్కువైంది.


సినిమాలో ఎలా చూపించారు?

హీరామండిని నేపథ్యంగా తీసుకొని అల్లిన కొన్ని కల్పిత కథలను ‘హీరామండి’లో చూపించారు.

ప్రధానంగా మల్లికా జాన్ అనే సెక్స్ వర్కర్ జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భారత స్వాతంత్ర్యానికి ముందు జరిగిన పరిణామాలు దీనిలో కనిపిస్తాయి.

అయితే, దీనికి ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ సిరీస్‌ను మెచ్చుకుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.

చుడటానికి అందంగా కనిపించినప్పటికీ దీనిలో కథ కరవైందని వైర్‌కు రాసిన రివ్యూలో తత్సమ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సిరీస్‌ను కళ్లను కట్టిపడేసే అద్భుతం అని ఫస్ట్‌పోస్టుకు రాసిన రివ్యూలో లక్ష్మీ దేబ్ రాయ్ చెప్పారు.

Tags:    

Similar News