Vyooham: వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్

Vyooham: ఇవాళ సినిమా విడుదల చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు

Update: 2023-12-29 02:17 GMT

Vyooham: వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ 

Vyooham: రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలపై గత కొన్నిరోజుల నుంచి కొనసాగుతున్న సందిగ్ధత తొలగింది. జనవరి 11 వరకు ‘వ్యూహం’ సినిమాను విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈనెల 26న దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. సుమారు ఐదు గంటల పాటు హైకోర్టులో వాదనలు సాగాయి. సినిమా విడుదలకు హైకోర్టు నిరాకరించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన పొలిటికల్‌ డ్రామా ‘వ్యూహం’. దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మాత. అజ్మల్‌ అమీర్‌, మానస రాధాకృష్ణన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్‌ 29న దీనిని విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయ జీవితాన్ని తెలియజేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో TDP అధినేత చంద్రబాబును కించపరిచేలా చూపించారని ఇటీవల నారా లోకేశ్‌ ఆరోపించారు. ఈ మేరకు ‘వ్యూహం’ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికేట్‌ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమా విడుదల కూడా నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.

Tags:    

Similar News