SP Balasubrahmanyam Wedding anniversery: ఆసుపత్రిలోనే గాన గంధర్వుడు బాలు పెళ్లిరోజు వేడుక!
SP Balasubrahmanyam and his wife (file image)
కరోనా మహమ్మారి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఆసుపత్రి పాలు చేసిన సంగతి తెలిసిందే. చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో కొంతకాలంగా ఆయన కరోనాతో పోరాడుతున్నారు. మధ్యలో అయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే, ఆసుపత్రి వైద్యుల సేవలతో ప్రస్తుతం అయన ఆరోగ్యం కుదుట పడినట్టు తెలుస్తోంది. గత శనివారం అయన కుమారుడు చరణ్ సోమవారం నాన్న గురించిన శుభవార్త వింటారు అని చెప్పారు. దీంతో బాలు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యానికి సంబంధించిన శుభవార్త ఈరోజు వింటామని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఆయన ఆరోగ్యంగా ఉన్నారనే సంకేతాన్ని తీసుకువచ్చింది తమిళ సోషల్ మీడియా.
మొన్న శనివారం బాలసుబ్రహ్మణ్యం పెళ్లిరోజు. ఈ సందర్భంగా అయన సతీమణి ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ అన్ని జాగ్రత్తలతో బాలు ఉన్న ఐసీయూ లోనే కేక్ కట్ చేసి దంపతులిద్దరూ తమ 51 వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. డాక్టర్లు, ఐసీయూ సిబ్బంది సమక్షంలో బాలు 51వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఏ పోస్టులు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే దీనిని ఆసుపత్రి వర్గాలు కానీ, బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, చరణ్ ఇప్పటికే సోమవారం శుభవార్త వింటారని చెప్పిన నేపధ్యంలో బాలూ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నరనే వార్తలకు అభిమానులు సంబరపడిపోతున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావడం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.