అఖండ 2లో సన్యాసినిగా శోభన..
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కతోన్న చిత్రం అఖండ2. ఈ మూవీ చిత్రీకరణ మహాకుంభమేళాలో జరుగుతోంది
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కతోన్న చిత్రం అఖండ2. ఈ మూవీ చిత్రీకరణ మహాకుంభమేళాలో జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆమె ఈ సినిమాలో ఓ సన్యాసిని పాత్రలో కన్పిస్తారని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. కాగా శోభన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కిలో కూడా కీలక పాత్రలో నటించి మెప్పించారు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్‌లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ2. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
ఇటీవల బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ అఘోర పాత్రలతో కూడిన సినిమా కావడంతో ఈ కుంభమేళాలో కోట్ల మంది భక్తులు, లక్షల మంది అఘోరాలు, నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కోట్ల మంది జనాల మధ్య మూవీ చిత్రీకరణ అంటే సాధారణ విషయం కాదని.. ఇది చిత్ర యూనిట్‌కు ఒక ఛాలెంజ్ అనే చెప్పాలన్నారు. ఇక బోయపాటి మాటలతో ఫ్యాన్స్ అంచనాలు రెట్టింపు అయ్యాయి.
2021లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రానికి కొనసాగింపుగా అఖండ2 తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. బోయపాటి, బాలయ్య కాంబోతో వస్తున్న నాలుగో చిత్రమిది. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల డాకు మహారాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బాలయ్య.. త్వరలో అఖండ2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్యకు అఖండ2 ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి మరి