Tollywood Sankranti 2026: హిట్టు కొట్టినా కలెక్షన్లు కరువు.. టాలీవుడ్ మేకర్స్‌కు సంక్రాంతి క్లాష్ గుణపాఠం!

Tollywood Sankranti 2026: తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, అది అతిపెద్ద బాక్సాఫీస్ సీజన్.

Update: 2026-01-23 11:21 GMT

Tollywood Sankranti 2026: తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, అది అతిపెద్ద బాక్సాఫీస్ సీజన్. అయితే, ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు భారీ సినిమాలు పోటీ పడటం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 'రాజా సాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు', 'నారీ నారీ నడుమ మురారి', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు' చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఈ పోటీ వల్ల సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఐదు చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రభాస్ నటించిన భారీ ప్రాజెక్ట్ ‘రాజా సాబ్’ మరియు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మిశ్రమ స్పందనతో యావరేజ్‌గా నిలిచాయి.

సాధారణంగా సంక్రాంతి సీజన్‌లో మూడు లేదా నాలుగు సినిమాలకు సరిపోయేంత స్పేస్ ఉంటుంది. కానీ ఐదు సినిమాలు రావడంతో ప్రేక్షకులు డివైడ్ అయిపోయారు. మంచి టాక్ వచ్చినప్పటికీ థియేటర్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవ్వడంతో శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సినిమాల వసూళ్లకు గండి పడింది.

మెగాస్టార్ సినిమాకు ఉన్న క్రేజ్, ప్లానింగ్ వల్ల కలెక్షన్ల విషయంలో పెద్దగా ఇబ్బంది కలగలేదు. ఇతర సినిమాల కంటే ముందే రావడం, స్పెషల్ షోలు కూడా పడటంతో చిరంజీవి చిత్రం సేఫ్ జోన్‌లోకి వెళ్ళింది.

పోటీ తక్కువగా ఉంటే ఈ మూడు హిట్ చిత్రాల వసూళ్లు మరో స్థాయిలో ఉండేవని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కేవలం పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తే మేకర్స్‌కు ఇలాంటి ‘వసూళ్ల డ్యామేజ్’ తప్పదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. భారీ చిత్రాల విడుదల విషయంలో నిర్మాతల మధ్య సమన్వయం ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. భవిష్యత్తులోనైనా మేకర్స్ తమ విడుదల తేదీల విషయంలో పాఠాలు నేర్చుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News