Rakul: 'ఆ సినిమాలో నన్ను తీసేసి కాజల్‌ను తీసుకున్నారు'.. రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rakul: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో తెలుగుతో తొలి హిట్‌ను సొంతం చేసుకుంది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్.
Rakul: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో తెలుగుతో తొలి హిట్‌ను సొంతం చేసుకుంది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. అనంతరం అనతి కాలంలోనే అగ్ర కథానాయిక జాబితలో ఒకరిగా పేరు సంపాదించుకుందీ బ్యూటీ. వరుసగా భారీ చిత్రాల్లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇక వివాహం తర్వాత తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలో ఛాన్స్ వచ్చిందని అయితే ఒక షెడ్యూల్ షూటింగ్ జరిగిన తర్వాత తనను తీసేశారని చెప్పుకొచ్చింది. ఈ విషయమై రకుల్ మాట్లాడుతూ.. 'ప్రభాస్‌తో ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. అప్పుడు నేను దిల్లీలో చదువుకుంటున్నా. దీంతో షెడ్యూల్ పూర్తి కాగానే తిరిగి దిల్లీ వెళ్లిపోయా. అక్కడికి వెళ్లాక రెండో షెడ్యూల్ కోసం ఎన్నిరోజులైనా ఫోన్ రాలేదు. నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తర్వాత తెలిసింది. నాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ సినిమా నుంచి తొలగించేశారు' అని చెప్పుకొచ్చింది.
అయితే అప్పటికే ప్రభాస్, కాజల్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చి విజయవంతం కావడంతో.. మరోసారి ఆ జోడి రిపీట్ అయితే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్ తనను తొలగించినట్లు కాజల్ చెప్పుకొచ్చింది. ఇక సినిమా అనేది ఓ వ్యాపారం అని చెప్పుకొచ్చిన రకుల్.. ఇందులో కొత్తగా పరిశ్రమకు వచ్చిన అమ్మాయిలకు ఇలా జరగడం సహజమే అని తెలిపింది. తనకు ఎన్నోసార్లు ఇలా జరిగిందని, ఒక అవకాశం పోయినా.. దానికి మించింది మన కోసం ఎదురుచూస్తుంటుందని భావిస్తున్నానని తనదైన ఫిలాసఫీ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే రకుల్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అజయ్‌దేవగణ్ హీరోగా తెరకెక్కుతోన్న‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తోంది. ‘దే దే ప్యార్ దే’కి కొనసాగింపుగా అన్షుల్ శర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.