ఎస్పీబీకి భారతరత్న ప్రకటించాలంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు

Update: 2020-09-29 12:26 GMT

అనితరసాధ్యమైన అమృత గానంతో పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు బాలుకు భారత రత్న ప్రకటించాలని డిమాండ్‌ చేస్తుండగా తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా వీరికి మద్దతుగా ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. మరో వైపు ఎస్పీ బాలు ఆస్పత్రి బిల్లుల ఇష్యూ రగడ రాజుకోవడంతో ఎస్పీ చరణ్‌ ఖండించారు.

దేశం గర్వించదగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమ్మణ్యంకు భారతరత్న ఇవ్వాల్సిందిగా ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఐదున్నర దశాబ్దాల కాలంలో 16 భాషల్లో 40 వేలకు పైగా గీతాలు ఆలపించి బాలు దేశ ప్రజల మన్నలను అందుకున్నారని ప్రధానికి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంగీత ప్రియులను తన పాటలతో ఆకట్టుకున్నారన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పురస్కారాలను ఎన్నో కైవసం చేసుకున్నారని జగన్‌ లేఖలో ప్రస్తావించారు. తన ప్రతిభతో పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను సైతం పొందారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. సంగీతంలో విశేష కృషిచేసిన లతామంగేష్కర్, భూపేన్‌హజారిక, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, బిస్మిల్లాఖాన్, భీమ్‌సేన్ జోషి వంటి వారికి భారతరత్నతో కేంద్రప్రభుత్వం గౌరవించిందని సీఎం జగన్ తెలిపారు. అంతటివారితో సరిసమానుడైన ఎస్పీ బాలసుబ్రమ్మణ్యానికి కూడా భారతరత్న ఇచ్చి గౌరవించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇక తన తండ్రి చేసిన సేవలకు భారతరత్న ఇస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌ వ్యక్తం చేశారు. బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఆస్పత్రి బిల్లులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ ఖండించారు. ఆస్పత్రిలో తన తండ్రి చికిత్సకు అయిన మొత్తం బిల్లును చెల్లించినట్లు తెలిపారు. బిల్లు కట్టక తన తండ్రి భౌతికకాయం ఇవ్వలేదన్న ప్రచారం అవాస్తవమన్నారు. ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు గుర్తుగా నెల్లూరులో ఓ స్మారకాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. మరోవైపు ఎస్పీబీకి భారతరత్న ప్రకటించాలంటూ ఇప్పటికే సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు వైరల్‌ అవుతున్నాయి. ఆయన సేవలను గుర్తించాలని అభిమానులు కోరుతున్నారు.

Tags:    

Similar News