OG Movie Review : జపాన్ సమురాయ్ నుంచి ముంబై మాఫియా వరకు.. ఓజీ హిస్టరీ వేరే లెవల్!
OG Movie Review: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ(OG - ఓజాస్ గంభీర) థియేటర్లలోకి వచ్చేసింది.
OG Movie Review: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ(OG - ఓజాస్ గంభీర) థియేటర్లలోకి వచ్చేసింది. పవన్ వీరాభిమాని అయిన దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ మాస్ అండ్ స్టైలిష్ లుక్, ఆయన ఆరా.. తెరపై ఎలాంటి విధ్వంసం సృష్టించింది? తమన్ సంగీతం, రవి కే చంద్రన్ విజువల్స్.. సినిమాకు ఎంత బలంగా నిలిచాయి? ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అని చెబుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.
సింపుల్ కథ.. స్టైలిష్ కథనం
ఓజీ కథ చాలా సింపుల్ రివెంజ్ డ్రామా చుట్టూ తిరుగుతుంది. 1970లలో జపాన్ నుంచి భారత్‌కు వచ్చిన సత్య దాదా (ప్రకాష్ రాజ్), తన దత్తపుత్రుడు ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కల్యాణ్) తో కలిసి ముంబైలో ఒక పెద్ద పోర్టును, వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ సత్య దాదాకు రక్షణగా నిలిచిన ఓజీ ఒకానొక కారణం వల్ల తన అన్న లాంటి సత్య దాదా పెద్ద కొడుకును చంపి, ముంబై వదిలి 15 ఏళ్లపాటు నాసిక్‌లో కణ్మని (ప్రియాంక మోహన్) తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే, విదేశాల నుంచి వచ్చిన క్రూరమైన గ్యాంగ్‌స్టర్ ఓమి (ఇమ్రాన్ హష్మీ) ముంబై మాఫియాను కబ్జా చేసి, సత్య దాదా సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని చూస్తాడు. ఓమీ వర్గం దాడిలో సత్య దాదా చిన్న కొడుకు పార్థూ చనిపోతాడు. రాజ్యాన్ని, రాజుని కాపాడటానికి, అలాగే తన కుటుంబానికి వచ్చిన ముప్పును అడ్డుకోవడానికి.. ఓజీ తిరిగి ముంబైలో అడుగుపెట్టాడు. ఓజీ గతం ఏంటి? అతనికి జపాన్ సమురాయ్‌ల తో ఉన్న సంబంధం ఏమిటి? ఓమిని ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా కథ.
ఎలివేషన్స్‌కి కేరాఫ్ అడ్రస్!
దర్శకుడు సుజీత్ కథ పాతదే అయినా, దాన్ని ప్రజెంట్ చేసిన తీరు మాత్రం అద్భుతం. పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన సుజీత్.. తమ అభిమాన హీరోను తెరపై ఎలా చూడాలనుకున్నాడో.. అంతకంటే 100 రెట్లు బాగా చూపించాడు. కథను పవన్ కళ్యాణ్ ఆరా చుట్టూ అల్లుకున్నాడు. కథనం చాలా పకడ్బందీగా, ప్రతి 10 నిమిషాలకు ఒక హై ఇచ్చేలా రాసుకున్నాడు. ముఖ్యంగా జపాన్ నుంచి కథ మొదలుపెట్టడం, ఆ సమురాయ్ పాయింట్ ని గ్యాంగ్‌స్టర్ డ్రామాకు జోడించడం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇస్తుంది.
ఫస్టాఫ్ : పవన్ కళ్యాణ్ ఎంట్రీ, యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయి. ఫస్టాఫ్‌ను సుజీత్ ఎక్స్‌ట్రార్డినరీగా క్లోజ్ చేసి, సెకండాఫ్‌పై భారీ అంచనాలను పెంచాడు.
సెకండాఫ్ : డాటర్ సెంటిమెంట్ తో కథ మరింత బలంగా మారుతుంది. ముంబైకి తిరిగి వచ్చిన ఓజీ.. పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ను బెదిరించే ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ క్రేజ్‌కు నిదర్శనం. ఓమీ, ఓజీ మధ్య ఫేస్ టు ఫేస్ సీన్లు, అలాగే అర్జున్, ఓజీల మధ్య ఛేజింగ్ సీన్లు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. క్లైమాక్స్.. పార్ట్ 2 కోసం ఇచ్చిన ట్విస్ట్ అంచనాలను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్తుంది.
నటీనటుల ప్రదర్శన
ఓజస్ గంభీర పాత్రలో పవన్ కల్యాణ్ అద్భుతంగా నటించాడు. ఇటు ఎమోషన్, అటు యాక్షన్ రెండింటిలోనూ దుమ్ము దులిపేసాడు. ఈ సినిమా పవన్ కల్యాణ్ స్టైల్, స్వాగ్, ఫైట్స్‌కు స్పెషల్ అట్రాక్షన్. ఇన్నేళ్ల కెరీర్‌లో పవర్ స్టార్‌ను ఇంత పవర్ ఫుల్‌గా, మీనింగ్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో ఇంత క్రేజీగా ఎవరూ చూపించలేదు. అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫుల్ మీల్స్ అందించాడు. ఇమ్రాన్ హష్మీ ఓమి పాత్రలో పవర్‌ఫుల్ విలన్‌గా నటించి, పవర్ స్టార్‌కు సవాల్ విసిరాడా అనేంతగా కనిపించాడు. అతని విలనిజం బాగుంది. ప్రియాంక మోహన్ కణ్మని పాత్రలో కనిపించేది కొంతసేపే అయినా, అందంగా కనిపించి ఫుల్ మార్కులు కొట్టేసింది. శ్రీయారెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ తో పాటు సినిమాలో కనిపించిన ప్రతి పాత్రకు దర్శకుడు ప్రాధాన్యత ఇచ్చి, తమ పాత్రలకు న్యాయం చేసేలా చూసుకున్నారు.
టెక్నికల్ అంశాలు
సాంకేతికంగా ఈ సినిమాకు ఎక్కువ మార్కులు పడతాయి. ఎస్ఎస్ తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. మామూలు సన్నివేశాన్ని కూడా తన రీ-రికార్డింగ్‌తో నిలబెట్టేసాడు. పలు సన్నివేశాలను ఓ రేంజ్‌లో ఆడించేశాడు. రవి కే చంద్రన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా తీర్చిదిద్దాడు. ఎంచుకున్న కలర్ ప్యాటర్న్ సినిమాను క్లాస్‌గా, రిచ్‌గా మార్చింది. రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ కథను సుజిత్ స్టైలిష్‌గా తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం. ఈ సినిమాకు సుజిత్, తమన్, పవన్ కల్యాణ్ ముగ్గురు హీరోలుగా నిలిచారు.
నిర్మాణ విలువలు: డీవీవీ దానయ్య అనుసరించిన నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
చివరి మాట
OG.. ఇప్పటివరకు తెలుగు తెర మీద రాని ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. రెగ్యులర్ గ్యాంగ్ వార్ డ్రామా అయినప్పటికీ.. జపాన్ సమురాయ్ నేపథ్యం, పవన్ కల్యాణ్ మీనింగ్‌ఫుల్ యాక్షన్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు కొత్తదనం తీసుకొచ్చాయి. పవర్ స్టార్ అభిమానులకు ఇది ఒక పండుగ లాంటి సినిమా, ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటిది. యాక్షన్, ఎమోషన్, డాటర్ సెంటిమెంట్ ఉన్న ఈ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ సినిమాను అలాంటి సినిమాలను ఇష్టపడేవారు అస్సలు మిస్ కాకూడదు. ఓవరాల్ గా OG.. ఫ్యాన్స్ ఖుషీ!
రేటింగ్ : 3.5/5