NTR: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు.. హాజరైన చంద్రబాబు, బాలకృష్ణ, రామ్ చరణ్, వెంకటేశ్, నారాయణమూర్తి..

NTR: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్

Update: 2023-05-21 04:44 GMT

NTR: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు.. హాజరైన చంద్రబాబు, బాలకృష్ణ, రామ్ చరణ్, వెంకటేశ్, నారాయణమూర్తి..

NTR: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా కూకట్‌పల్లి కైత్లాపూర్‌ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో కలిసి సినిమాలు, రాజకీయాల్లో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, వారి వారసులు, సీనియర్‌ నాయకులను నందమూరి కుటుంబసభ్యులు సత్కరించారు. వచ్చే ఏడాది మే 28 నాటికి హైదరాబాద్‌లో వంద అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ టి.డి.జనార్దన్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

మహా నాయకుడు ఎన్టీ రామారావుకు భారతరత్న సాధించి తీరుతామని టీడీపీ అధినేత అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పురస్కారం ఆయనకు కాదని... దేశానికి చేసిన సేవలకు అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడమంటే దేశాన్ని గౌరవించుకున్నట్లేనని అభిప్రాయపడ్డారు. ఎన్టీ రామారావు ఒక వ్యక్తి కాదని.. ఒక శక్తి అన్నారు చంద్రబాబు. తెలుగుజాతి ఉన్నంతవరకు అందరి గుండెల్లో శాశ్వతంగా ఉంటారని తెలిపారు.ఎన్టీఆర్‌పై రూపొందించిన శకపురుషుడు సావనీర్‌తో పాటు జై ఎన్టీఆర్‌ వెబ్‌సైట్‌ను ముఖ్యులతో కలిసి చంద్రబాబునాయుడు, బాలకృష్ణ ఆవిష్కరించారు.

ఎన్నో ఉన్నతమైన భావాలు, ఆదర్శప్రాయ వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతమని బాలకృష్ణ అన్నారు. ఎంతోమంది నాయకులకు సాధ్యం కాని పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేసుకున్నారు. ఎందరో నటులకు సాధ్యం కాని పాత్రలను అవలీలగా పొషించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. ప్రతి తెలుగువాడి ఆత్మాభిమానాన్ని తన భుజంపై మోశారని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్‌ మరణం లేని నేత... ఏ వేషం వేసినా ఆ పాత్రకు వన్నె తెచ్చారని అన్నారు.

మన ఆలోచనల స్థాయికి అందని గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు నటుడు రామ్ చరణ్‌. తెలుగు సినీ పరిశ్రమ గురించి ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన నడయాడినచోట పనిచేస్తున్నామంటే అంతకంటే భాగ్యం ఏముంటుందన్నారు. తాను అయిదో తరగతిలో ఉండగా.. వాళ్ల మనవడితో కలిసి ఇంటికి వెళ్తే స్వయంగా తనకు టిఫిన్ పెట్టారని గుర్తు చేసుకున్నారు. తెలుగు పరిశ్రమ ఉన్నంత కాలం ఆయనకు రుణపడి ఉంటుందని... దక్షిణాది సినిమా సత్తాను ఆయన అప్పుడే చాటి చెప్పారని రామ్ చరణ్ అన్నారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమన్నారు హీరో నాగచైతన్య. తెలుగు సినిమాకు ఎన్టీఆర్‌ ఒక అందమని తెలిపారు. తాత నాగేశ్వరరావు వారి స్నేహం గురించి గొప్పగా చెప్పేవారని తెలిపారు. ఒక నటుడిగా, సీఎంగా ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నాగచైతన్య అన్నారు.

సుమారు 50 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ వద్దకు కాల్‌షీట్ల కోసం వెళ్తే తన బ్యానర్‌కు వైజయంతి అని పేరు పెట్టారని నిర్మాత అశ్వనీదత్ గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ తన బ్యానర్‌ కొనసాగుతోందంటే అది ఎన్టీఆర్ ఆశీర్వచన బలమేనని అన్నారు. మరో 100 ఏళ్లయినా ఆయన స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుందని అశ్వనీదత్ పేర్కొన్నారు.

కళాకారుడిగా సినిమా పరిశ్రమకు, తెలుగు జాతికి ఆయన ఎంతో చేశారని హీరో వెంకటేశ్ అన్నారు. అంత గొప్ప వ్యక్తిని శత జయంతి వేడుకల్లో తలచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానట్లు తెలిపారు. వందేళ్లు గడిచినా ఆయన పేరు మారుమోగుతోందంటే తెలుగు వాడిగా గర్వపడుతున్నట్లు చెప్పారు. ఆయనతో తాను కలిసి నటించలేకపోవడం లోటుగానే ఉందని వెంకటేష్ అన్నారు.

ఎన్టీఆర్‌ ఏ వేషం వేసినా ఒప్పించగలరని దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. దేశానికి సేవలందించిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకివ్వలేదు? ఆయనకు ఏం తక్కువ అని ప్రశ్నించారు. వంద రూపాయల నాణెంపై ఆయన బొమ్మ వేశారని సంతృప్తి పడొద్దని.... కేసీఆర్‌, జగన్‌, చంద్రబాబునాయుడు, సీపీఎం, సీపీఐ నేతలందరూ కలిసి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేయాలని పేర్కొన్నారు.  

Tags:    

Similar News