MAA Elections : 'మా' బిల్డింగ్ కొనుగోలు, అమ్మకంపై మాటల మంటలు

* రూ.71.73 లక్షలతో 'మా' బిల్డింగ్ కొనుగోలు * రూ.30 లక్షలకే అసోసియేషన్ బిల్డింగ్‌ విక్రయం

Update: 2021-09-09 16:30 GMT

మా (ఫైల్ ఫోటో)

MAA Elections : టాలీవుడ్ మూవీ అసోసియేషన్ ఎన్నికలు నేషనల్ పాలిటిక్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా నడుస్తున్నాయి. 'మా' అసోసియేషన్ బిల్డింగ్ ఎపిసోడ్ కార్నర్‌గా మాటల మంటలు రాజుకుంటున్నాయి. ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్మేశారంటూ డైలాగ్ కింగ్ చేసిన కామెంట్స్ రగడ ఇంకాస్త రాజుకుంది. మోహన్ బాబు కామెంట్స్‌కు మెగా బ్రదర్ కౌంటర్ ఇచ్చి 24 గంటలు గడవక ముందే 'మా' అసోసియేషన్ మాజీ చీఫ్ రియాక్ట్ అయ్యారు. ఇంతకూ మా అసోసియేషన్‌లో జరుగుతున్న బిల్డింగ్ రచ్చ ఏంటి..?

'మా' ఎన్నికల నిర్వహణపై క్రమ శిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన గత నెలలో జూమ్ మీటింగ్ జరిగింది. ఈ వర్చువల్ సమావేశంలో పలువురు మా సభ్యులు పాల్గొన్నారు. ఈ సమయంలోనే డైలాగ్ కింగ్ మోహన్ బాబు బిల్డింగ్ అమ్మకం అంశంపై కామెంట్ చేశారు. భారీ నిధులతో భవనాన్ని కొనుగోలు చేసి, అతి తక్కువ ధరకు ఎందుకు అమ్మేశారని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ విషయంలో సినిమా పెద్దలు అప్పుడు ఎందుకు పెదవి విప్పలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా మోహన్ బాబు ప్రశ్నలపై మెగా బ్రదర్ రియాక్ట్ అయ్యారు.

బిల్డింగ్ కొనుగోలు చేసిన సమయంలో తానే అధ్యక్షుడిగా ఉన్నానన్న నాగబాబు సినీ పెద్దల సూచనలు, అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకొనే 71 లక్షల 73వేలతో భవనాన్ని కొనుగోలు చేశామన్నారు. అలాగే, ఇంటీరియర్ డిజైన్ కోసం మరో మూడు లక్షలు వెచ్చించినట్లు వివరించారు. 2006 నుంచి 2008 వరకూ తానే అధ్యక్షుడిగా ఉన్నానన్న నాగబాబు అధ్యక్ష పీఠం నుంచి దిగిన తర్వాత 'మా' వ్యవహారాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదని 'మా' అభివృద్ధికి కావాల్సిన సలహాలు మాత్రమే ఇచ్చానన్నారు. బిల్డింగ్ అమ్మకం గురించి మళ్లీ తనపై వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అయితే, నాగబాబు వ్యాఖ్యలపై 24 గంటలు గడవక ముందే శివాజీరాజా రియాక్ట్ అయ్యారు. నాగబాబు హయాంలో ఎంత నిజాయతీతో ఆ ఫ్లాట్ కొన్నారో, తాను అధ్యక్షుడిగా, నరేశ్ కార్యదర్శిగా ఉన్న సమయంలో అంతే నిజాయతీతో అమ్మేశామని కౌంటర్ ఇచ్చారు. సింగిల్ గోడ, కింద మురికి కాలువ వంటి అనేక ప్రతికూలతలు ఉండడంతో ఫ్లాట్ అమ్మాలని పలువురు పెద్దలు సైతం సూచించారన్నారు. ఇంకా ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే తనను అడగొచ్చని క్లారిటీ ఇచ్చారు.

'మా' బిల్డింగ్ కొనడం, అమ్మేయడం జరిగి చాలా కాలమే అయినా ఎన్నికల నేపధ్యంలో మళ్లీ తెరపైకి తేవడం హాట్‌టాపిక్ అవుతోంది. ప్రధానంగా 'మా' అసోసియేషన్ ఎన్నికల్లో మోహన్ బాబు తనయుడు విష్ణు పోటీచేయడం, 'మా'కు సొంత బిల్డింగ్ కడతామన్న ప్రధాన ఎజెండాతో ప్రచారం చేయడం ఇదే సమయంలో ప్రకాష్ రాజ్‌కు నాగబాబు బాహాటంగానే మద్దతు ప్రకటించడం లాంటి అంశాల నేపధ్యంలోనే ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 'మా' ఎన్నికల వ్యవహారంలో అసోసియేషన్ బిల్డింగ్ ఎపిసోడ్ కీలకంగా మారినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News