Movie Artist Association: నేడు 'మా' కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం

*ర్యాలీగా వెళ్లనున్న మంచు విష్ణు ప్యానల్ *ముఖ్య అతిథిగా హాజరు కానున్న మంత్రి తలసాని

Update: 2021-10-16 02:46 GMT

నేడు 'మా' కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం(ఫైల్ ఫోటో)

Movie Artist Association: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ప్రమాణానికి సర్వం సిద్ధమైపోయింది. ఉదయం 11 గంటలకు 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు, కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా 'మా' సభ్యులందరికీ ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, డీఆర్సీ సభ్యులు మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలోని కొందరు పెద్దలను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

మరోవైపు గత మూడురోజులుగా టాలీవుడ్ ప్రముఖులను కలిసిన మోహన్‌బాబు, విష్ణులు కార్యవర్గ ప్రమాణానికి ఆహ్వానాలు అందించారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణను స్వయంగా కలిసి ఆహ్వానించిన మంచు ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారా లేదా అనేదానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అయితే, బుధవారం మంచు విష్ణు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన మనోజ్‌ పవన్‌తో సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు తాజా సినిమాల ప్రస్తావన వచ్చిందని పైకి చెబుతున్నారు. కానీ, ప్రమాణస్వీకారం ప్రస్తావన వచ్చిందా అన్న సస్పెన్స్ మాత్రం అందరిలోనూ కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే 'మా' ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణు ప్రమాణ స్వీకారానికి ముందే బాధ్యతలు స్వీకరించేశారు. 2015 నుంచి అధ్యక్షపదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతల్ని స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన విష్ణు ప్రమాణ స్వీకారానికి ముందే బాధ్యతలు చేపట్టారు. ఇక, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన అంతా రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఇవాల్టి కార్యక్రమం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఎన్నిక జరిగిన తీరుపై కోర్టుకెళ్లే ఉద్దేశ్యంలో ఉన్న ప్రకాష్ రాజ్ టీమ్ తర్వాతి స్టెప్ ఏంటన్న ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో కనిపిస్తోంది.

Tags:    

Similar News