లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు.. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లలో కస్టమ్స్ దాడులు

Luxury Car Smuggling: మలయాళ స్టార్ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కస్టమ్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.

Update: 2025-09-23 10:23 GMT

Luxury Car Smuggling: మలయాళ స్టార్ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కస్టమ్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. లగ్జరీ కార్ల అక్రమ రవాణా (స్మగ్లింగ్) ఆరోపణలకు సంబంధించిన కేసులో భాగంగా ఈ సోదాలు జరిగాయి. 'ఆపరేషన్ నమకూర్' పేరుతో దేశవ్యాప్తంగా విలాసవంతమైన కార్ల స్మగ్లింగ్‌పై కస్టమ్స్ దర్యాప్తు చేస్తోంది.

ఈ దర్యాప్తులో భాగంగానే కేరళలోని పలువురు ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. కోచి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలతో పాటు పనంపిల్లి నగరంలోని దుల్కర్ సల్మాన్ ఇంటిలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లగ్జరీ వాహనాలు లభించలేదని కస్టమ్స్ అధికారులు చెప్పినట్లు సమాచారం.

ఈ ఇద్దరు నటుల ఇళ్లతో పాటు కోచి, కొజికోడ్, మలప్పురం సహా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కస్టమ్స్ దాడులు జరిగాయి. ఈ సోదాల ద్వారా కొన్నేళ్లుగా జరుగుతున్న లగ్జరీ కార్ల అక్రమ రవాణాపై అధికారులు మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News