పుట్టినరోజు సెలబ్రేషన్స్ వద్దు.. ఇది వేడుకల టైం కాదు: బహిరంగ లేఖలో ఎన్టీఆర్

Jr NTR: 'ఈ సారి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దు.. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదని' ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు లేఖ రాశారు.

Update: 2021-05-19 06:37 GMT

జూనియర్ ఎన్టీఆర్ (ఫొటో ట్విట్టర్)

Jr NTR Birthday: 'ఈ సారి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దు.. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదని' జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బహిరంగంగా లేఖ రాశారు. మే 10 న జూనియర్ ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయనతోపాటు కుటుంబ సభ్యులు హోం క్యారంటైన్‌లో ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తూ.. తన ఆరోగ్య పరిస్థితిని అభిమానులకు తెలియజేస్తూనే ఉన్నారు.

తాజాగా, రేపు (మే 20, గురువారం) ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు ఆయన 'ఏ హంబుల్ రిక్వెస్ట్' అంటూ బహిరంగంగా లేఖ విడుదల చేశారు. అయితే, ఎన్టీఆర్ పుట్టిన రోజు కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ రకంగా ఇది నిరాశేనని చెప్పుకోవచ్చు. కానీ, ప్రస్తుతం దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని, ఎవ్వరూ బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

"గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలను చూస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకెంతో ఊరటను కలిగిస్తున్నాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను చాలా బాగున్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకుని కోవిడ్‌ను జయిస్తానని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టినరోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ, ఈ ఏడాది మాత్రం మీరంతా ఇంటి వద్దనే జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే నాకు మీరిచ్చే అతి పెద్ద కానుకలా భావిస్తానని" ఎన్టీఆర్ పేర్కొన్నారు.

అలాగే "ఇది వేడుకలు చేసుకునే టైం కాదు. ఇండియా కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు మనం సంఘీభావం తెలపాలి. ఆత్మీయులను కోల్పోయిన వారికి అండగా నిలబడాల్సిన సమయం. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ.. మీరూ జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మనదేశం ఈ కరోనాను జయిస్తుంది అని నమ్ముతున్నా. ఆ రోజు మనమందరం కలిసి వేడుక చేసుకుందాం.." అని ఎన్టీఆర్‌ అభిమానులకు లేఖ రాసుకొచ్చాడు. ఈమేరకు అభిమానులు కూడా.. మీ మాటే మాట రామయ్య అంటూ.. ఆయనకు మద్దతు పలికారు.

ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి డైరెక్షన్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. అలాగే, కొరటాల శివతోనూ #NTR30 తో బిజీగా ఉన్నాడు. అయితే, కరోనాతో ఆయా సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News