Tollywood: ఒక్క సినిమా వంద విశేషాలు.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఇంట్రెస్టింగ్ అంశాలు
Chiranjeevi: జగదేక వీరుడు అతిలోక సుందరి తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం.
Chiranjeevi: జగదేక వీరుడు అతిలోక సుందరి తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం. మెగాస్టార్ చిరంజీవి, అలనాటి అందాల తార శ్రీదేవి జంటగా నటించిన ఈ సోషియో-ఫాంటసీ మాస్టర్‌పీస్ మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. 1990 మే 9న విడుదలైన ఈ చిత్రం 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని 9న రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* జగదేవ వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదల సమయంలో ఎలాంటి హైప్ ఉందో చెప్పాలంటే, రూ. 6 ధర గల టికెట్ బ్లాక్ మార్కెట్‌లో రూ. 210 వరకు అమ్ముడైందన్న వార్తే చాలు. అంటే సుమారు 35 రెట్లు ఎక్కువ ధర! ఇది అప్పటి క్రేజ్‌కు నిదర్శనం.
* కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి టూరిస్ట్ గైడ్‌గా, శ్రీదేవి ఇంద్రలోకం నుంచి వచ్చిన సుందరిగా మెరిశారు. అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
* చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో 'అబ్బ నీ తీయని దెబ్బ' పాట గురించి మాట్లాడుతూ – “ఇళయరాజా గారు ఉదయం 9కి ట్యూన్ పనులు ప్రారంభించి మధ్యాహ్నానికి కంప్లీట్ చేశారు. భోజన సమయంలో వేటూరి గారు సాహిత్యం రాశారు. బాలు గారు సరదాగా పాడారు. ఇది ఓ రోజు లోపే పూర్తయిన అద్భుతం” అని తెలిపారు.
* దర్శకుడు రాఘవేంద్రరావు ‘అందాలలో’ పాట గురించి మాట్లాడుతూ – “కథలో హీరో మానవుడు, హీరోయిన్ దేవత కావడం వల్ల ఇది పాట రూపంలో తెలియజేయాలని నిర్ణయించాం. అందుకే ఆ పాట అంత ప్రత్యేకంగా ఉంటుంది” అన్నారు.
* అశ్వినీదత్ ‘దినక్కుతా’ పాట షూటింగ్ వెనుక ఉన్న ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు – “ఆ టైంలో చిరంజీవి గారికి 106 డిగ్రీల జ్వరం. శ్రీదేవి కాల్‌షీట్లు రెండు రోజులు మాత్రమే ఉండటంతో, ఆయన తీవ్రంగా శ్రమించారు. ప్రతి షాట్ తర్వాత ఆయనను ఐస్ కవర్లతో చల్లబరిచాం. ఆ వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. 15 రోజుల చికిత్స తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు.”
* శ్రీదేవి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఈ సినిమాలో ఇష్టమైన పాట ‘ప్రియతమ’ అని చెప్పారు. “కేవలం కంటి చూపులు, హావభావాలతో మాత్రమే తెరకెక్కించిన ఈ మెలోడీ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అది మరపురాని అనుభూతి” అని అన్నారు.
* ఈ సినిమాకు అజయన్ విన్సెంట్, కె.ఎస్. ప్రకాష్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించగా, ఇళయరాజా సంగీతం ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. యండమూరి వీరేంద్రనాథ్ కథను అందించగా, స్క్రీన్‌ప్లేను జంధ్యాల రచించారు.